కార్డులు తనఖా పడితే.. భరతం పడతాం | Ration dealers Goods Irregularities | Sakshi
Sakshi News home page

కార్డులు తనఖా పడితే.. భరతం పడతాం

Oct 26 2014 1:17 AM | Updated on Sep 2 2018 4:48 PM

ప్రజాపంపిణీ వ్యవస్థకు విఘాతం కలిగించడం నేరం. రేషన్ కార్డులను తనఖా పట్టే వారి భరతం పడతాం. పేద లబ్ధిదారుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని రేషన్ కార్డులను తనఖా

ప్రజాపంపిణీ వ్యవస్థకు విఘాతం కలిగించడం నేరం. రేషన్ కార్డులను తనఖా పట్టే వారి భరతం పడతాం. పేద  లబ్ధిదారుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని రేషన్ కార్డులను తనఖా పట్ట డం ద్వారా అనేకమంది ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను బొక్కుతున్నారు. అటువంటి వారిపై 420 కేసులు నమోదు చేస్తాం. రేషన్ డీలర్లు, మిల్లర్లు సైతం ప్రజాపంపిణీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలోనే మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిపై నిఘా వేసి  ఆటకట్టిస్తామని విజిలెన్స్,  ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆర్.ఎస్.ఆర్.కె.రాజు అన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:రేషన్ కార్డులను తనఖా పట్టి ప్రజాపంపిణీ వ్యవస్థకు ఆటంకం కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆర్‌ఎస్‌ఆర్‌కె రాజు హెచ్చరించారు. లబ్ధిదారులు తమ తక్షణ అవసరాల కోసం వ్యాపారుల వద్ద కార్డులను కుదువపెడుతున్నట్టు తమకు సమాచారం ఉందని, నిబంధనల ప్రకారం వ్యాపారులు వాటిని తమ వద్ద ఉంచుకోరాదని ఆయన అన్నారు. దీన్ని ఉల్లంఘించే వారిపై 420 కేసు నమోదు చేయిస్తామన్నారు.  
 
 తుపాను సరుకులపై ప్రత్యేక నిఘా
 తుపాను బాధితులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం అక్రమంగా నిల్వ చేసినా, నల్లబజారుకు తరలించినా, రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. దీనికి సంబంధించి దుకాణాలు, రేషన్ డీలర్లు, రైస్ మిల్లులపైనా ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. వివిధ నేరాల కింద ఇప్పటికే 12 మంది డీలర్లపైన, 9 దుకాణాలపైన దాడులు జరిపి అక్రమంగా నిల్వ చేసిన సరుకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయనగరం జిల్లాలో కూడా ఐదు కేసులు నమోదు చేయించామన్నారు. తంగివానిపేటలో 15 క్వింటాళ్లు, కొర్లాంలో 17 క్వింటాళ్ల బియ్యంతో పాటు కోటా బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి బయట మార్కెట్లో విక్రయిస్తున్న 207 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సముద్రపు ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై ఇటీవల పైడి భీమవరంలో ఓ కేసు నమోదు చేశామని, ఈ కేసులో ఓ పొక్లెయిన్, 13 ట్రాక్టర్లను సీజ్ చేసి అక్కడి పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.
 
 లాభార్జనకే
 రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాలోనే రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. లాభార్జనకు వ్యాపారులు ఇదో మార్గంగా ఎంచుకున్నారని, ప్రభుత్వం రూ.22 రేటుకు బియ్యం కొనుగోలు చేసి డీలర్ల ద్వారా తుపాను బాధితులకు సరఫరా చేస్తుంటే వ్యాపారులు వాటిని రీ సైక్లింగ్ చేసి నల్లబజారులో విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారంపై పెదపాడు రోడ్డులో కొద్దిరోజుల క్రితం దాడి చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బయట వ్యక్తులకు తెలియకుండా ఉండేందుకు పీడీఎస్ బియ్యాన్నే సంచులు మార్చి బజార్లో విక్రయిస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదుల విషయంలోనూ ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
 
 ఈ విషయంలో ప్రజల కు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇసుక, బియ్యం, నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా, అక్రమ మైనింగ్‌పై పౌరులు డీఎస్పీ కుమార్(నెం.80082-03241)కు ఫోన్ చేయొచ్చని ఎస్పీ రాజు సూచించారు. నిత్యావసర వస్తువులను నల్లబజారుకు తరలించేవారిపై 6ఏ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇసుక అక్రమంగా తవ్వినా, తవ్విన చోట యంత్రాలున్నా కేసులు తప్పవని హెచ్చరించారు. ఇసుక పట్టుబడిన కేసుల్లో డ్రైవర్‌తో పాటు యజమానిపైనా కేసులు నమోదు చేయిస్తామన్నారు. గతంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోద చేసేవారని, ఇప్పుడు మార్పులొచ్చాయని, అయినప్పటికీ పకడ్బందీగా కేసులు నమోదు చేసి సీజ్ చేసిన సామగ్రి ద్వారా అక్రమార్కులు అపరాధ రుసుం చెల్లించేలా రికార్డులు తయారు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
 
 ఉన్నంతలోనే బాధ్యతగా
 వాస్తవానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇక్కడే విజిలెన్స్ కార్యాలయం ఉంది. ఎస్పీతో పాటు ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లే ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ సంఖ్య ఒక పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బంది సంఖ్య కంటే తక్కువే. అయినప్పటికీ ఉన్న సిబ్బందితోనే వివిధ ఫిర్యాదులపై స్పందించి కేసుల నమోదుకు సిద్ధమవుతున్నామని ఎస్పీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement