జనతరంగం | Pushkarni devotees gets many problems | Sakshi
Sakshi News home page

జనతరంగం

Jul 21 2015 4:23 AM | Updated on Sep 3 2017 5:51 AM

జనతరంగం

జనతరంగం

రోజులు గడుస్తున్నా పుష్కర భక్తులు, యాత్రికుల జోరు మాత్రం తగ్గడం లేదు...

చినుకులన్నీ వాగులై.. ఏరులై.. నదులై.. సాగరాన్ని చేరినట్టు..
అన్నిమార్గాల నుంచి గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు.
జనతరంగమై పుష్కర ఘాట్లను ముంచెత్తారు. వాతావరణం గంటకో రకంగా మారుతూ హోరు గాలి.. జోరు వాన..
మండే ఎండగా దోబూచులాడినా లెక్కచేయకుండా
పుష్కర గోదారి చెంతకు ఉరకలెత్తారు. పశ్చిమాన పవిత్ర నదీ
తీరం పుష్కరోత్సవ శోభతో వెలిగిపోయింది.
- అదే జోరు.. భక్త జన హోరు
- పురోహితులు చాలక పిండ ప్రదానాల కోసం అవస్థలు
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో ఘాట్ల సమీపానికి వస్తున్న వాహనాలు
- కొవ్వూరులో గాలివాన.. భక్తుల ఇక్కట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
రోజులు గడుస్తున్నా పుష్కర భక్తులు, యాత్రికుల జోరు మాత్రం తగ్గడం లేదు. పుబ్బ నక్షత్రం.. సోమవారం కావడంతో రికార్డు సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మహాశివునికి ఇష్టమైన సోమవారం రోజున పిండ ప్రదానాల సంఖ్య రెట్టింపైంది. తగినంతమంది పురోహితులు లేక జిల్లాలోని చాలా ఘాట్లలో క్రతువుల నిర్వహణకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. శనివారం నాటి రద్దీ ఆదివారం ఒకింత తగ్గినా సోమవారం మాత్రం జనం పోటెత్తారు.

జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగడం.. ఎక్కడికక్కడ భారీ వాహనాలను మళ్లించడంతో పుష్కర భక్తులు వాహనాల్లో సాఫీగానే ఘాట్ల సమీపానికి చేరుకుంటున్నారు. కొవ్వూరులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన గాలులు, వర్షం యాత్రికులను అవస్థలకు గురి చేశాయి. అన్ని ఘాట్లలోని మెట్లు తడవడం, రోడ్లన్నీ బురదమయంగా మారడంతో స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
 
పుష్కర స్నానం ఆచరించిన మంత్రి మాణిక్యాలరావు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తమ కుటుంబ సభ్యులతో కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించారు. పిండప్రదానాలు చేశారు. అనంతరం గోశాలలో గో పూజలు నిర్వహించారు.
 
అనధికార ఘాట్ల మూసివేత
ఓ యువకుడి మృతితో అధికారులు కళ్లు తెరిచారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం, చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని అనధికార ఘాట్లను మూసివేశారు. సిద్ధాంతంలోని కేదారిఘాట్‌తో పాటు మండలంలో ఉన్న ఇతర ఘాట్లలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. ఉదయం పూట వర్షం కారణంగా భక్తులకు కాస్త అసౌకర్యం కలిగింది.
 
కొనసాగుతున్న లాంచీ ఇబ్బందులు
పోలవరంలో భక్తుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పుణ్యస్నానాలు చేసిన భక్తులు పట్టిసీమ క్షేత్రాన్ని వేలసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో లాం చీలు సమయానికి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. లాంచీల సంఖ్య పెంచాలని పుష్కరాల ప్రారంభం నుంచి భక్తులు డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పెరవలి మండలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముక్కామల బ్రహ్మగుండ క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తీపర్రు ఘాట్‌లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పడంతో దుర్గంధం వస్తోందని భక్తులు వాపోయారు.
 
బురదలోనే నడక
యలమంచిలి మండలం చించినాడ, లక్ష్మీపాలెం ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. చించినాడలో ఘాట్‌కు వెళ్లే రహదారి వర్షం కారణంగా బురదమయంగా మారింది. భక్తులు బురదలోనే నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఘాట్ల వద్ద పురోహితుల సంఖ్య తక్కువగా ఉండటంతో పిండ ప్రదానాల కోసం భక్తులు ఎక్కువ సమయం వేచివుండాల్సి వచ్చింది. శని, ఆదివారాల కంటే భక్తుల రద్దీ తగ్గడంతో ఆచంట, నిడదవోలు మండలాల్లోని ఘాట్లలో స్నానాలు సాఫీగా సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement