నాడూ నేడూ ఒకే కుటుంబంలో విషాదం | People Died in Crackers Accident Visakhapatnam | Sakshi
Sakshi News home page

వెలుగుల మాటున మృత్యువు

Mar 26 2019 12:13 PM | Updated on Mar 29 2019 1:23 PM

People Died in Crackers Accident Visakhapatnam - Sakshi

క్షతగాత్రుడిని పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్‌

పెందుర్తి: వెలుగుల మాటున మృత్యువు కాటేస్తోంది. సాధారణ ప్రజలకు వినోదాన్ని పంచుతున్న మతబులు, చిచ్చుబుడ్డులు, తారాజువ్వులు, బాంబులు.. వాటిని తయారు చేస్తున్న వారి కుటుంబాల్లో మాత్రం పెను విషాదాన్నే నింపుతున్నాయి. బతకలేకో.. బతకడం కోసమో రోజువారీ సూక్ష్మ ఆదాయం కోసం పెను ప్రమాదంతో సావాసం చేస్తున్న వారి జీవీతాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మొత్తానికి బాణసంచాతో సమాజంలో వెలుగులు నింపుతున్న వారి జీవీతాలు ప్రమాదాల రూపంలో ఆరిపోతున్నాయి. సబ్బవరం మండలం గుళ్ళేపల్లిలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో కూలీ తీవ్ర గాయాలపాలవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిలో నిర్వాహకుడి భార్య, పొట్టకూటి కోసం పనికి వచ్చిన కూలీ ప్రాణాలు పోగొట్టుకోవడం మరింత విషాదం. నాణేనికి రెండోవైపు చూస్తే ఈ ప్రమాదం వెనుక పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందనిపిస్తుంది. అనుమతి లేని బాణసంచా కేంద్రాలపై కొరడా ఝుళిపించాల్సిన ఖాకీలు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో పరిస్థితి అదుపు తప్పుతుంది. ఫలితంగా గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా సోమవారం నాటి దుర్ఘటనలో ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. మరో ఐదురుగు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు.

నాడూ నేడూ ఒకే కుటుంబంలో విషాదం
గుళ్ళేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న దాసరి సత్యనారాయణకు బాణసంచా తయారీయే ప్రధాన ఆదాయ వనరు. 2009లో తయారీకి అనుమతి పొందిన సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతోనే కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో 2012లో ఆర్డర్లపై విస్తృతంగా బాణసంచా తయారు చేస్తున్న క్రమంలో ముడి సరుకు భారీ విస్పోటానికి గురైంది. దీంతో అక్కడే ఉన్న దాసరి సింహాచలమ్మ(సత్యనారాయణ మొదటి భార్య), రొంగలి భవాని(సత్యనారాయణ మేనకోడలు), దాసరి నూకరాజు(కూలీ) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంతో కొన్నాళ్లపాటు బాణాసంచా తయారీ నిలిచిపోయింది. అదే సమయంలో కేంద్రానికి ఉన్న అనుమతి కూడా రద్దయింది. కానీ కొన్నాళ్ల తరువాత ఆదాయం లేకపోవడంతో సత్యనారాయణ మళ్లీ కేంద్రాన్ని అనుమతి లేకుండా ప్రారంభించాడు. దీంతో 2018 సెప్టెంబర్‌లో దీనిపై ఫిర్యాదు అందడంతో సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి కేంద్రం నిర్వహించకుండా బైండోవర్‌ కూడా చేశారు. అయితే సత్యనారాయణ తనపని తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మరోసారి అదే తయారీ కేంద్రంలో మందుగుండు విస్పోటం జరిగింది. దీంతో సత్యనారాయణ రెండో భార్య కోటమ్మ(22), కూలీ సింగంపల్లి దుర్గారావు(55) మరణించారు. సత్యనారాయణ తండ్రి దాసరి సత్యం, తల్లి దాసరి గంగమ్మ(49), సోదరుడు దాసరి చిన్న(అలియాస్‌ అంకుల్‌)(30) మరో సోదరుడు దాసరి కనకరాజు (29), చిన్న భార్య దాసరి రాములమ్మ(28) తీవ్ర గాయాల పాలయ్యారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అదే సమయంలో అనధికారికంగా బాణసంచా కేంద్ర నిర్వహిస్తున్నాడన్న ఆరోపణతో సత్యనారాయణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బాధితులకు అదీప్‌రాజ్‌ పరామర్శ
గుళ్లేపల్లి బాణసంచా ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితుడు సత్యనారాయణను ఓదార్చారు. అతడి కుటుంబానికి పార్టీ, తన తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య బాధిత కుటంబాన్ని పరామర్శించారు.

బాధితుల పరిస్థితి విషమం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఏడుగురిని సోమవారం కేజీహెచ్‌కు తరలించారు. వీరి పరిస్థితిని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున సమీక్షించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేజీహెచ్‌కు తీసుకొచ్చిన వారంతా 80 నుంచి 90 శాతం కాలిపోయారని, వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. ఏడుగురు బాధితుల్లో కోటమ్మ (21), ఎస్‌.దుర్గారావు (58) మరణించారని, మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, వీరిని ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.ఇందిరాదేవి, అనెస్థీషియా హెడ్‌ డాక్టర్‌ ఎ.సత్యనారాయణ, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్త్రి, ఆర్‌ఎంవో డాక్టర్‌ సీహెచ్‌.సాధన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement