అర్హత ఉంటే 5 రోజుల్లోనే పింఛన్‌

Pension within 5 days if eligible - Sakshi

సంతృప్త స్థాయిలో అర్హులందరికీ అందజేయడమే సర్కారు లక్ష్యం 

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు

మంజూరైన మరుసటి నెల నుంచే డబ్బులు పంపిణీ

ఇక నుంచి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది

రేపటి నుంచే కొత్త విధానం

సాక్షి, అమరావతి: అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే ఫించన్‌ను మంజూరు చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ ఒకటి నుంచి శ్రీకారం చుట్టనుంది. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు అందాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుంది. కొత్త దరఖాస్తులను పరిశీలించి వారు అర్హులుగా తేలితే కేవలం ఐదు రోజుల్లో పింఛన్‌ మంజూరు చేస్తారు. ఆ మరుసటి నెల నుంచి లబ్ధిదారునికి ఆ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. ఈ నూతన విధానం ద్వారా పింఛను దరఖాస్తుదారుడు మండలాఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. గ్రామ సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ మొదలై, తిరిగి సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు అందజేస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈఓ రాజాబాబు కొత్తగా పింఛను మంజూరులో వివిధ దశల ప్రక్రియను వివరించారు. ఆ వివరాలు.. 

– పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి స్వయంగా గానీ లేదంటే వలంటీరు ద్వారా గ్రామ, వార్డు సచివాలయంలో పింఛను దరఖాస్తును ఇవ్వాలి.
– దరఖాస్తు సమయంలో అతని అర్హతకు సంబంధించిన ధృవీకరణ పత్రాలన్నీ సమర్పించాలి.
– సచివాలయలో ఉండే డిజిటల్‌ అసిస్టెంట్‌ ఆ దరఖాస్తును స్వీకరించి, వివరాలన్నీ అన్‌లైన్‌లో నమోదు చేసి, దరఖాస్తుదారునికి ఒక రశీదు అందజేస్తారు.
– దరఖాస్తుదారుడికి సంబంధించి ప్రభుత్వ రికార్డులో నమోదైన వివరాలతో దరఖాస్తులోని వివరాలను పోల్చి చూస్తారు. తొమ్మిది స్థాయిలలో పరిశీలన జరిగి.. ఆ దరఖాస్తుకు సంబంధించి ఒక నివేదిక తయారవుతుంది. 
– ఆ తర్వాత ఈ వివరాలన్నీ గ్రామ, వార్డు సచివాలయంలో ఉండే వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ వద్దకు చేరుతాయి. 
– వెల్పేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ క్షేత్రస్థాయిలో అన్నీ పరిశీలించి సమగ్ర నివేదిక తయారుచేస్తారు.
– ఈ నివేదికను గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంపీడీఓకు, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేస్తారు. 
– ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు నివేదికలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హత నిర్ధారించి పింఛను మంజూరు చేస్తారు. 
– ఈ మంజూరు పత్రాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాలకు చేరిన తర్వాత వాటిని వలంటీరు ద్వారా లబ్ధిదారుని పంపిణీ చేస్తారు. 
– దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేసి, దరఖాస్తుదారుడు పింఛనుకు అర్హుడో కాదో నిర్ధారిస్తారు. 
– పింఛను మంజూరు అయితే లబ్ధిదారునికి ఆ మరుసటి నెల నుంచి డబ్బులు పంపిణీ చేస్తారు. 

కాగా.. వైఎస్‌ జగన్‌ సర్కారు నవశకం కార్యక్రమం ద్వారా ఇప్పటికే 6.11 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసింది. దీని తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని.. వీటి అర్హతపై పరిశీలన జరుగుతోందని సెర్ప్‌ సీఈఓ రాజాబాబు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top