భూములూ పోయే.. పరిశ్రమా రాకపాయె.. ?

Patanjali Company Not Given Compensation To Farmers In srungavarapukota, Vizianagaram - Sakshi

‘పతంజలి’కి భూముల పందేరం

నేటికీ ఎస్సీలకు దక్కని భూమి

బలవంతంగా లాక్కున్నారంటూ గగ్గోలు

సాక్షి, శృంగవరపుకోట (విజయనగరం): పరిశ్రమలు వస్తాయి.. పది మందికీ ఉపాధి వస్తుంది.. ఉద్యోగాలు వస్తాయి. మీ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి. మీ పిల్లలు ఉద్యోగస్తులు అయిపోతారంటూ పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టి పంటభూముల్ని పరిశ్రమల కోసం లాక్కున్నారు. ఏళ్లు గడిచాయి.. పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి తప్ప పరిశ్రమల జాడలేదు. ఉపాధి, ఉద్యోగాల ఊసే లేదు.

పరిశ్రమల పేరుతో పందేరం 
పతంజలి పరిశ్రమను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం భూసేకరణకు పూనుకుంది. కొత్తవలస మండలం చినరావుపల్లిలో పతంజలి ప్రాజెక్ట్‌ కోసం టీడీపీ ప్రభుత్వం తరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న జీడి, మామిడితోటలను బలవంతంగా సేకరించింది. చినరావుపల్లి, పెదరావుపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 350 మంది రైతుల నుంచి 172.84 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.

పరిహారం పంపిణీ అరకొరగానే..
భూ సేకరణ సమయంలో రైతులు ఎకరాకి 20 నుంచి 25 లక్షలు నష్టపరిహారం కోరగా ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా రూ. 7 లక్షలు, ఉద్యానవశాఖ ద్వారా మరో 50 వేలు కలిపి ఎకరాకి రూ 7.50 లక్షలు చొప్పున చెల్లించారు. 571 జీఓ ప్రకారం 10 సంవత్సరంలు పైబడి సాగులోఉన్న రైతులకు 7.50 లక్షలు, 10 నుంచి 5 సంవత్సరాల్లోపు సాగులో ఉన్న రైతులకు రూ. 3.25 లక్షలు.. 5 సంవత్సరాల్లోపు సాగులో ఉన్న వారికి అసలు నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేసినట్లు రైతులు వాపోతున్నారు.  భూ సేకరణలో భాగంగా భూములిచ్చిన 15 ఎస్సీ కుటుంబాలకు, నాలుగు బీసీ కుంటుంబాలకు నేటికీ పరిహారం అందలేదు. నష్టపోయిన ఎస్సీలకు భూమికి ప్రతిగా భూమి, రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని కోర్టులో ఉన్న కేసుల్ని విత్‌డ్రా చేయించి, ఇప్పటికీ భూముల కేటాయింపు చేయలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల నుంచి తీసుకున్న భూములను మళ్లీ వారికే అప్పగించాలని పలువురు కోరుతున్నారు.

భూములు లాక్కున్నారు 
చినరావుపల్లిలో సర్వే నంబర్‌ 95 నుంచి 105, 87/1, 87/3,90లో 2.93/1 నుంచి 44, 94–2, 98 నంబర్లలో 145.64 ఎకరాలు సేకరించగా, పెదరావుపల్లిలో  27.20 ఎకరాలు సేకరించి మొత్తం 172.84 ఎకరాలు పతంజలికి దారాధత్తం చేశారు. ఇందులో ఆక్రమణదారుల నుంచి 41.79 ఎకరాలు, డీ పట్టా భూములు 66.20 ఎకరాలు, ప్రభుత్వభూమి 6.62 ఎకరాలు, పీఓటీ భూములు 22.56 ఎకరాలు, ప్రైవేట్‌ వ్యక్తుల జిరాయితీ భూములు 8.47ఎకరాలు, పంతంజలి ప్రాజెక్టుకు దారాధత్తం చేశారు.

తగ్గించి అమ్మకం..
టీడీపీ ప్రభుత్వంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు ఎంఎస్‌ఎంఈ పార్కులు అభివృద్ధి పేరిట ఏపీఐఐసీ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో భూసేకరణ చేసింది. వీటిలో కొత్తవలస, రామభద్రపురం, భోగాపురం మండలాల్లో మాత్రమే పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. చినరావుపల్లిలో రైతుల వద్ద నుంచి ఎకరా 7.50 లక్షల రూపాయలు చెల్లించి తీసుకున్న భూముల్ని ఎకరానికి రూ. 2.50 లక్షలు తగ్గించి కట్టబెట్టి చంద్రబాబు సర్కారు తన ప్రేమను చాటుకుంది. నాడు పరిశ్రమ కోసం మాజీ ఎమ్మెల్యే సహా, ఆమె అనుచరులు, రెవెన్యూ అధికారులు భయపెట్టి భూసేకరణ చేశారని రైతులు  ఆరోపిస్తున్నారు.

ఒత్తిడి చేశారు...
మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుందని.. స్థానికులకు అవకాశం కల్పిస్తారని.. భూములు అతి తక్కువ ధరకే అమ్మేటట్లు రైతులపై ఒత్తిడి తీసుకువచ్చారు. 172.84 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా కొనుగోలు చేశారు. పరిశ్రమలు రానపుడు కేవలం భూములు అమ్ముకొవడం కోసమే ఇదంతా చేశారు. రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాడతా.
–బూసాల దేముడు చినరావుపల్లి

నమ్మించి మోసం చేశారు..
మాకు అన్యాయం జరుగుతుందని మా జీవనోపాధి పోతోందని కోర్టుకు వెళ్లిన మమ్మల్ని భూమికి భూమి ఇస్తామంటూ నమ్మబలికి ఇప్పుడు రెండు సెంట్ల భూమి చేతిలో పెట్టి పొమ్మంటున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు.
–  పెట్ల నరసింగరావు, చినరావుపల్లి

ఒక్కరూపాయి చెల్లిస్తే ఒట్టు..
పతంజలి కంపెనీ కోసం అన్నదమ్ములం సాగు చేసుంటున్న భూమి పీఓటీలో ఉందంటూ బలవంతంగా లాగేసుకున్నారు. తీసుకున్న భూమికి పరిహారం చెల్లిస్తామన్నారు. నేటికి ఒక్క రూపాయికూడా చెల్లించలేదు. టీడీపీ నాయకులు మాకు అన్యాయం చేశారు.
– బొబ్బిలి ఎర్రయ్య చినరావుపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top