ఇదేం ఏసీ.. ఛీఛీ..

Passengers suffer as AP Express AC stops working - Sakshi

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేయని ఏసీలు 

 చెమటలు కక్కుతూనే ప్రయాణం 

 చైన్‌ లాగి రైలును ఆపేసిన ప్రయాణికులు 

 రాజమహేంద్రవరంలో మూడు గంటల సేపు అవస్థలు

   ఇతర రైళ్లలో విశాఖకు తరలింపు  

రాజమహేంద్రవరం : న్యూఢిల్లీ నుంచి విశాఖ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీలు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. న్యూఢిల్లీలో రైలు బయలుదేరినప్పటి నుంచి జనరేటర్లలో లోపాలు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చినా లోపం సరిచేయలేదని ఆరోపించారు. మూడు బోగీలకు ఒకటి చొప్పున ఏసీలు పని చేయకపోవడంతో చంటి పిల్లలు శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఏసీలు లేకపోవడంతో బయటి కంటే బోగీల్లోనే వేడి ఎక్కువగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

వేడిని భరించలేక కొంత మంది చైన్‌ లాగి రైలును ఆపేశారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్న ఈ రైలు ప్రయాణికులు సుమారు మూడు గంటలకు పైగా రైల్వేస్టేషన్‌లోనే పిల్లలతో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో కొంతమందిని జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పంపించగా, మరి కొంతమందిని ప్రత్యేక రైలులో 5.30 గంటలకు విశాఖకు తరలించారు. ఈ రైలులో మొత్తం 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.  

శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డాం 
ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్నాను. మొదటి నుంచీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే.. సమస్య తమ పరిధిలో కాదని చెప్పేవారు. ఫోన్‌ ద్వారా కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే.. పీఎన్‌ఆర్‌ నంబర్‌ వస్తుందని చెప్పి ఫోన్‌ పెట్టేసేవారు. రాత్రంతా ఏసీలు పని చేయలేదు. పిల్లలకు శ్వాస ఆడలేదు. మూడు గంటలకు పైగా స్టేషన్‌లోనే ఉండిపోయాం. రైల్వే అధికారులు ముందుగానే చెక్‌ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు.          
–శ్రీనివాస్, విశాఖపట్నం 

చెమటలు కక్కుతూ ప్రయాణించాం 
ఏసీలు పని చేయక చెమటలు కక్కుతూ ప్రయాణించాం. అసౌకర్యం భరించలేక కొంతమంది చైన్‌ లాగి రైలును ఆపేశారు. రైల్వే అధికారులు తప్పు ఉంది కనుక వారిపై కేసులు కూడా పెట్టలేదు. రైల్వే అధికారుల బాధ్యతా రాహిత్యం వల్ల ప్రయాణికులు నరకం చూశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.    
– ఆర్‌టీ నాయుడు. విశాఖపట్నం          
                 

పిల్లలతో ఎంతో బాధపడ్డాం 
నేను విజయవాడలో ఎక్కాను. ఇద్దరు పిల్లలతో విశాఖపట్నం వెళుతున్నాను. ఏసీలు పని చేయక పిల్లలు ఏడుపు మొదలు పెట్టారు. రైల్వే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? రైల్వే అధికారులకు డబ్బులు లేకపోతే ప్రయాణికుల వద్ద డొనేషన్లు తీసుకోవాలి. కావాలంటే మేమే ఇస్తాం. అంతేగాని ప్రయాణికులను ఇబ్బందులు గురి చేయరాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రైలు ప్రయాణం లేటు అవుతుందని బస్సుకు వెళుతున్నాను.      
– హైమారెడ్డి, విజయవాడ
 

ప్రయాణికులందరూ ఇబ్బంది పడ్డారు  
నేను ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళుతున్నా. రైలు బయలుదేరినప్పటి నుంచి ఏసీల్లో లోపం ఏర్పడింది. రైల్వే అధికారులు శ్రద్ధ తీసుకొని ఉంటే ఇంత మంది ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు కాదు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రయాణికులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలి. 
- బల్వీందర్‌ సింగ్, న్యూఢిల్లీ                   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top