ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు.
ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్ల అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు పడవని.. గెలవడం కష్టమవుతుందని భావించి ఎవరుపడితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీ వీడతానన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ప్రజల మనోభావాలే ముఖ్యం తప్ప పార్టీ కాదని తేల్చి చెప్పారు.
ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఆ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా జరగడం సహజమని, అది ఆయనకు సంబంధించిన విషయం కాదని ఒక ప్రశ్నకు సమాదానంగా బదులిచ్చారు. ఒకవేళ ఆయనను(కోట్ల) పిలిచినా పెద్దగా స్పందించడన్నారు. కార్యక్రమానికి పిలవలేదని అధికారులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, ఈ మేరకు పలువురు అధికారులతో తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. అధికారుల వద్ద పెద్ద తరహాగా ఉండాలే తప్ప గౌరవం పోగొట్టుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు.