ఇలాగైతే ఉంచలేం..

Parents Taken Childerns From Girls Hostel Visakhapatnam - Sakshi

కలుషితాహార ఘటనతో తల్లిదండ్రుల్లో కలవరం   

విద్యార్థినులను తీసుకువెళ్తున్న వైనం

బోసిపోతున్న భీమిలి గురుకుల పాఠశాల

ప్రిన్సిపాల్‌పై చర్యల విషయంలో మంత్రి గంటా తీరుపై అసంతృప్తి

ఆదివారం ఇళ్లకు వెళ్లిన సుమారు 300మంది..

భీమునిపట్నం: భీమిలిలోని ఆంధ్రప్రదేశ్‌ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన వారి తల్లిదండ్రులను కలవరపరిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన వారు తమ పిల్లలను హాస్టల్‌ నుంచి తీసుకువెళ్లిపోతున్నారు. శనివారం కొందరిని తీసుకువెళ్లగా, ఆదివారం ఏకంగా 300మంది వరకు పిల్లలు వెళ్లిపోయారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని కూడా ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందోనన్న భయంతో తీసుకు వెళ్లిపోయారు.

నమ్మకం కోల్పోయాం
ఇక్కడి గురుకుల పాఠశాలపై తామందరికీ ఎంతో నమ్మకం ఉండేదని, తాము ఎంత దూరంగా ఉన్నా పిల్లలు సురక్షితంగా ఉంటారని భావించేవారమని విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. కానీ ప్రిన్సిపాల్‌ రామరాజు కాలం తీరిన పప్పుతో పిల్లలకు భోజనాలు పెట్టి వారి ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా చేస్తారని ఊహించలేదన్నారు. విషయం తెలిసి అందరమూ వణికిపోయామన్నారు. తమ పిల్లలకు ఏమైందోనని హడలిపోయామని చెప్పారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్‌పై చర్యల విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అతను చేసిన ఘోర తప్పిదం కళ్లముందే కనబడుతున్నా వెంటనే సస్పెండ్‌ చేయవలసిందిపోయి సెలవుపై వెళ్లమనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, కానీ పరిస్థితి చూస్తే అటువంటి నమ్మకం తమకు కలగడం లేదని అన్నారు. తమ పిల్లల్ని కొద్దిరోజులు ఉంచుకుని తిరిగి తీసుకు వస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని కోరారు.

బోసిపోయిన గురుకులం
ఇక్కడ 451మంది విద్యార్థినులకు గాను మూడు వందల వరకు వెళ్లిపోవడంతో విద్యాలయం బోసిపోయింది. ఉన్న పిల్లల్ని కూడా సోమవారం తల్లిదండ్రులు తీసుకు వెళ్లిపోతే ఖాళీ అయే పరిస్థితి.

నిర్లక్ష్యం క్షమించరానిది
ఇక్కడ ఉంటున్న పిల్లల విషయంలో ప్రిన్సిపాల్‌ రామరాజు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు క్షమించరానిది. మొదటి నుంచి ఈయన వైఖరి సరిగ్గా లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని మేము ఎన్నోసార్లు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా వారి ప్రాణాలకే ముప్పు జరిగే విధంగా వ్యహరించిన తీరు ఘోరం.– మీసాల ఈశ్వరరావు, సిరిజాం, చీడికాడ మండలం
 
భయంతో తల్లడిల్లిపోయాం
 సంఘటన తెలియగానే అందరం భయంలో తల్లడిల్లిపోయాం. పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చినా ఇక్కడైతే వారు బాగుంటారని ధైర్యంగా ఉన్నాం. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదు.  
– ఖతీజాబీబీ, గాజువాక

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top