పంచాయతీ రికార్డుల కాల్చివేత | Panchayath Records Burnt in Chittoor | Sakshi
Sakshi News home page

పంచాయతీ రికార్డుల కాల్చివేత

Jan 19 2019 11:43 AM | Updated on Jan 19 2019 11:43 AM

Panchayath Records Burnt in Chittoor - Sakshi

కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తున్న అధికారులు, పోలీసులు

చిత్తూరు, సాక్షి/ వాల్మీకిపురం: వాల్మీకిపురం మేజర్‌ పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12 నుంచి 17 వరకు కార్యాలయానికి సెలవులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం సిబ్బంది కార్యాలయానికి రావడంతో విషయం బయటపడింది. అప్పటికే కార్యాలయంలో రికార్డులన్నీ కాలి బూడిదయ్యాయి. కుర్చీలు, ఇతర వస్తువులు కాలిపోయాయి. కంప్యూటర్లను దుండగులు పగులగొట్టారు. సమాచారం నిక్షిప్తమై ఉన్న హార్డ్‌ డిస్కులను పట్టుకెళ్లారు. బీరువాను పగులగొట్టి రికార్డులకు నిప్పు పెట్టారు. దీనిపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దశాబ్దాల రికార్డులన్నీ బూడిదయ్యాయి. పట్టణంలో వేలాది ప్రైవేటు కుళాయిలకు సంబంధించినరికార్డులు, ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతి వివరాలు, పంచాయితీ ఆధ్వర్యంలో లక్షలకు లక్షలు వెచ్చించి చేసిన పనులకు సంబంధించిన ఎంబుక్‌లు అన్నీ బూడిదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయితీకి నిధులు వరద పారింది. వీటిఖర్చుకు సంబంధించిన వివరాలు, మేజర్‌ పంచాయితీ ఆధ్వర్యంలో వసూలు చేసే ట్యాక్సులు, పన్నులు, రుసుములు, అద్దెలకు సంబం ధించిన విలువైన వివరాలన్నీ కాలిబూడిదైపోవడంతో వాల్మీకిపురం గ్రామ పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారిపై ఆరోపణలు..
వాల్మీకిపురం జిల్లాలోని మేజర్‌ పంచాయతీల్లో ఒకటి. పంచాయతీకి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.3 కోట్ల వరకు నిధులు వచ్చాయి. వీటిని మాజీ సర్పంచ్‌ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. ఇష్టారీతిన ఖర్చు చేసి దొంగ బిల్లులు సృష్టించారని స్థానిక నాయకులు చెబుతున్నారు. లే అవుట్లకు అధిక ఫీజులు వసూలు చేసి ఖజానాకు జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారని సమాచారం. మంచినీటి కుళాయిల అనుమతులకు ప్రజల నుంచి ఇష్టానుసారం వసూలు చేశారు. ఒక్కో కుళాయికి రూ.5 వేలు వసూలు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం రూ.10 నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసి అంతమేరకు బిల్లులు ఇచ్చారు. దీనికి ఇన్‌చార్జి ఈవో ఉదయ్‌కుమార్, స్పెషలాఫీసర్‌ అహ్మద్‌కు స్థానిక అధికారుల పూర్తి సహాయ సహకారా లున్నాయని సమాచారం. ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.3 కోట్ల వరకు పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాల్మీకిపురం పంచాయతీకి రూ.45 లక్షల నిధులు వచ్చాయి. వీటి ఖర్చుకు సంబంధించిన లెక్కలు ఇప్పటికీ ప్రభుత్వానికి సమర్పించలేదు.

ఆడిట్‌లో బయట పడకూడదనేనా?
మరో వారంలో ఆడిట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించున్నారు.  అవినీతి మొత్తం బయట పడుతుందనే రికార్డులన్నింటినీ తగులబెట్టారని ఆరోపణలు వినపడుతున్నాయి. కంప్యూటర్లలో సమాచారం ఉంటుందనే ఉద్దేశంతో వాటిని కూడా పగులగొట్టారు. మంచినీటి కుళాయి బిగించడానికి చేసిన వసూళ్లు, ఆస్తిపన్నులు, లే అవుట్లపై అధిక వసూళ్లు బయటపడుతాయని ఉద్దేశంతోనే రికార్డులను కాల్చివేశారని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు రవి విమర్శించారు.

నిందితులను పట్టుకుంటాం
రికార్డులను కాల్చివేసిన దుండగులను త్వరలోనే పట్టుకుంటాం. కాల్చివేత వెనుక దురుద్దేశం ఏదైనా ఉంటే విచారణలో బయటపడుతుంది. దుండగులు బీరువాలో ఉండే రికార్డులను, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారు. తెలిసిన వారే ఇదంతా చేసి ఉంటారని అనుమానం. ఏది ఏమైనా కేసును త్వరలోనే ఛేదిస్తాం. నిందితులను పట్టుకుంటాం.    – ఉలాసయ్య, సీఐ, వాల్మీకిపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement