‘సాఫ్ట్’గా దోచేశారు..! | Over abuse people income in economic department | Sakshi
Sakshi News home page

‘సాఫ్ట్’గా దోచేశారు..!

Mar 16 2015 2:16 AM | Updated on Sep 2 2017 10:54 PM

ప్రభుత్వ పెద్దలు, ఓ ఉన్నతాధికారి కుమ్మక్కై రూ.175 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అడ్డగోలు నిర్ణయానికి ప్రతిఫలంగా భారీ ఎత్తున ముడుపులు దండుకున్నారు.

ఆర్థిక శాఖలో కంప్యూటరీకరణ పేరిట రూ.175 కోట్ల దుర్వినియోగం
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు, ఓ ఉన్నతాధికారి కుమ్మక్కై రూ.175 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అడ్డగోలు నిర్ణయానికి ప్రతిఫలంగా భారీ ఎత్తున ముడుపులు దండుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 14, 2008న ఆర్థికశాఖను కంప్యూటరీకరించి.. లావాదేవీలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
 కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు.. వాణిజ్య పన్నుల వసూళ్లు.. విద్యార్థులకు ఉపకారవేతనాలు.. ఉద్యోగులకు వేతనాల చెల్లింపు తదితర అన్ని లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ భావన. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖజానా శాఖలో అప్పటి డెరైక్టర్ ఎన్‌సీ నాగార్జునరెడ్డి తన శాఖలో కొందరు మెరికల్లాంటి అధికారుల సహకారంతో అన్ని లావాదేవీలను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్-సీఎఫ్‌ఎంఎస్)ను రూపొందించారు.
 
 భద్రత లేదనే సాకు చూపి..
 ప్రభుత్వ సిబ్బంది రూపొందించిన సీఎఫ్‌ఎంఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్‌ల సాఫ్ట్‌వేర్‌లో రికార్డులకు భద్రత లేదని, సరికొత్త వ్యవస్థను రూపొందించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారుచేయడానికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థను కన్సల్టెన్సీగా నియమిద్దామని ప్రభుత్వ పెద్దలకు ఓ ఉన్నతాధికారి ప్రతిపాదించారు. నాగార్జునరెడ్డి నేతృత్వంలోని  బృందం రూపొందించిన తరహాలోనే కన్సల్టెన్సీ సంస్థ కూడా డీపీఆర్‌ను తయారుచేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.5 కోట్లను కన్సల్టెన్సీ ఫీజు కింద ప్రభుత్వం సమర్పించుకుంది. అందులో సగానికిపైగా ఓ ఉన్నతాధికారికి పర్సంటేజీ కింద కన్సల్టెన్సీ సంస్థ ముట్టజెప్పినట్లు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
 రూ.2 కోట్లకు.. రూ.175 కోట్లు!
 సదరు సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను అధ్యయనం చేసిన నాగార్జునరెడ్డి.. ప్రస్తుతం అమల్లో ఉన్న సీఎఫ్‌ఎంఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు అది భిన్నంగా లేకపోవడాన్ని పసిగట్టారు. భద్రత చర్యలు తీసుకోడానికి రూ.2 కోట్లు సరిపోయేదానికి రూ.350 కోట్లు ప్రతి పాదించటాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీంతో భయపడిన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఈ మొత్తాన్ని రూ. 175 కోట్లకు తగ్గించేశారు. అంతేగాక నాగార్జున రెడ్డిని పదవి నుంచి తప్పించారు. తాము లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకే ఆ పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. అక్టోబర్ 1, 2012న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయగా రెండు సంస్థలే టెండర్‌లో పాల్గొనగా అందులో ఓ సంస్థకు పనులను అప్పగించేసి భారీ ఎత్తున ముడుపులు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
  పనులు చేజిక్కించుకుని రెండున్నరేళ్లు కావస్తోన్నప్పటికీ కాంట్రాక్టు సంస్థలో చలనం కనిపించడం లేదు. కంప్యూటరీకరణను చేయడానికి వీలుగా రెండేళ్ల క్రితం జిల్లాలకు(ఏపీ, తెలంగాణ) కాంట్రాక్టు సంస్థ చేరవేసిన మానిటర్లు, సీపీయూలు, సర్వుర్లు తుప్పుపట్టిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కొత్త పద్ధతి అందుబాటులోకి రాకపోవడంతో పాత పద్ధతిలోనే ఆర్థికశాఖలు(ఏపీ, తెలంగాణ) లావాదేవీలు సాగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement