ఆ పాఠశాలలపై చర్యలకు ఆదేశాలివ్వండి

Order the actions against those schools - Sakshi

అధిక ఫీజులతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి

అనేక రకాల పేర్లతో తప్పుదోవ పట్టిస్తున్నాయి

అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్ముతున్నాయి

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

సోమవారం విచారించనున్న ఏసీజే ధర్మాసనం

సాక్షి, అమరావతి: ఏపీ విద్యా సంస్థల చట్ట నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్ముతున్న నారాయణ, శ్రీ చైతన్య, నెల్లూరు రవీంద్రభారతి, భాష్యం, డాక్టర్‌ కేకేఆర్‌ గౌతమ్‌ తదితర పాఠశాలలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని ముందడుగు ప్రజా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఎన్‌.గ్రేసీ దాఖలు చేశారు. ఇందులో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్, పలు జిల్లాల విద్యా శాఖాధికారులతోపాటు పైన పేర్కొన్న పాఠశాలలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యంపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్, కార్పొరేట్‌ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, చట్ట నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలల గుర్తింపును రద్దు చేసేలా విద్యాశాఖాధికారులను ఆదేశించాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ప్రైవేటు పాఠశాలలు అసాధారణ ఫీజులను వసూలు చేస్తూ దోచుకుంటున్నాయని, ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.

చట్ట నిబంధనల ప్రకారం.. ప్రతి స్కూల్‌లో గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేయాలని, ఇందులో తల్లిదండ్రులకు సైతం స్థానం కల్పించడం తప్పనిసరన్నారు. ఏ పాఠశాల తమ పాఠశాలల్లో ఎటువంటి పుస్తకాలు, స్టేషనరీ, ఇతర వస్తువులు అమ్మరాదంటూ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి ఈ నెల 11న సర్క్యులర్‌ జారీ చేశారని తెలిపారు. అయితే.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఈ సర్క్యులర్‌ను ఖాతరు చేయడం లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top