వడ్డీ కాదు..రాయితీయేసున్నా | not interest....discount zero | Sakshi
Sakshi News home page

వడ్డీ కాదు..రాయితీయేసున్నా

Dec 19 2013 4:28 AM | Updated on Aug 14 2018 4:01 PM

జిల్లా అంతటా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వడ్డీలేని రుణాల రాయితీలు అందుతున్నా పట్టణ మహిళలకు మాత్రం ఆ ఆశ అడియాసే అయింది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా అంతటా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వడ్డీలేని రుణాల రాయితీలు అందుతున్నా పట్టణ మహిళలకు మాత్రం ఆ ఆశ అడియాసే అయింది. పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీ రాయితీ అందించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో  9,193 గ్రూపుల పరిధిలో లక్ష మందికి పైగా మహిళలు వడ్డీ రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తం గ్రూపుల్లో కేవలం 772 గ్రూపులకు మాత్రమే వడ్డీ రాయితీ అందినట్టు అధికారవర్గాలే చెపుతున్నాయి. రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆయా గ్రూపుల రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.
ముందుగా మహిళలు చెల్లించిన వడ్డ్డీని ప్రభుత ్వం తిరిగి రాయితీగా బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపుల ఖాతాలకు జమచేస్తుంది. ఫలితంగా మహిళలు పొందిన రుణాలను వడ్డీలేని రుణాలుగా పరిగణిస్తారు.  2012లో ఈ పథకం అమలులోకి వచ్చాక జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని 9,193 గ్రూపులను ఈ పథకానికి అర్హమైనవిగా గుర్తించారు. ఈ గ్రూపులకు మొత్తం రూ.6.20 కోట్ల వడ్డీరాయితీ సొమ్ము మంజూరైంది. అయితే సంఘాలకు ఇచ్చింది రూ.37.24 లక్షలు మాత్రమే. అధికారుల అలసత్వం కారణంగా రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో పట్టణ మహిళలకు వడ్డీ రాయితీ అందడం లేదు.
 విడుదలైందీ అరకొరగానే..
 ప్రభుత్వం నుంచి పట్టణప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ( మెప్మా)కు, మెప్మా నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు, అక్కడి నుంచి బ్యాంకులకు, బ్యాంకుల నుంచి మహిళా సంఘాల ఖాతాలకు ఈ వడ్డీ రాయితీ జమ చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంకుల నుంచి అందే నివేదికలు(సకాలంలో రుణాలు చెల్లించిన గ్రూపులు) ఆధారంగా మున్సిపాలిటీలు రాయితీ సొమ్మును బ్యాంకులకు విడుదల చేస్తుంటాయి. కానీ జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్‌లతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఉన్న మహిళా గ్రూపులకు వడ్డీ రాయితీ అరకొరగానే విడుదల చేశారు. 2012 జనవరిలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు (జీరో పర్సంట్ వడ్డీతో) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా ఇంత వరకు కేవలం 772 గ్రూపులకు మాత్రమే రాయితీ అందించగా మిగిలిన గ్రూపుల్లోని మహిళలకు వడ్డీ రాయితీ అందని ద్రాక్షగానే మిగిలింది.

‘మున్సిపాలిటీలను అడుగుతుంటే ఎప్పుడో విడుదల చేశామంటున్నారు. తీరా బ్యాంకులను అడుగుతుంటే ఖాతాలకు సర్దుబాటు చేసేశామని చెపుతున్నారు’ అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెప్మా నుంచి నిధులు పూర్తిగా విడుదల చేయకపోవడంతో మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ సొమ్ము జమ కాలేదని విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి తెలిసింది. అనేక అవస్థలు ఎదుర్కొని రుణాలను వడ్డీలతో సహా సకాలంలో చెల్లించి, తమకు వడ్డీ సొమ్ములు తిరిగి వస్తాయని ఆశించిన మహిళలకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి తప్ప ఒక్క రూపాయి కూడా వడ్డీరాయితీ రాలేదని పట్టణ మహిళలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement