హాస్టళ్లపై ఫిర్యాదులొస్తే ఉపేక్షించం | not excuse if complaint came on hostels | Sakshi
Sakshi News home page

హాస్టళ్లపై ఫిర్యాదులొస్తే ఉపేక్షించం

Jul 22 2014 1:35 AM | Updated on Sep 2 2017 10:39 AM

జిల్లాలోని కళాశాలల హాస్టళ్లపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం.ఎస్.శోభారాణి హెచ్చరించారు.

కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలోని కళాశాలల హాస్టళ్లపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం.ఎస్.శోభారాణి హెచ్చరించారు. కళాశాలల హాస్టళ్ల వార్డెన్లతో సోమవారం ఆమె తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. 21 కళాశాలల హాస్టళ్లలో ఎక్కడా మెనూ చార్ట్ అతికించలేదని, విద్యార్థినీ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని మండిపడ్డారు. వారానికి 5 రోజులు కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

 పిల్లలు వారానికి ఒకరోజు చికెన్ చాలని చెబుతున్నట్లు వార్డెన్లు వివరించారు. ప్రతి హాస్టల్‌లో విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్ చేయాలని డీడీ సూచించారు. అన్ని హాస్టళ్లకు రెండు నెలల ముందుగానే లైబ్రరీ పుస్తకాలు, అల్మారాలు పంపిణీ చేశామని.. అయితే చాలా చోట్ల వాటిని ఉపయోగించుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి హాస్టల్‌కు పోటీ పరీక్షలకు అనుగుణంగా మరో వెయ్యి రూపాయల విలువల చేసే పుస్తకాలు అందిస్తామని, వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.

విద్యార్థులు పుస్తకం పోగొడితే అందుకు రెట్టింపు మొత్తం వసూలు చేయాలన్నారు. హాస్టళ్లలో నలుగురు విద్యార్థులచే మెనూ కమిటీ వేయాలన్నారు. విద్యార్థులు భోజనం చేయడానికి ప్లేట్లు, గ్లాసులు లేవని.. బెడ్‌షీట్లు, కార్పెట్, ట్రంకు పెట్టెలు అవసరమని వార్డెన్లు చెప్పడంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీడీ చెప్పారు. ప్రతి విద్యార్థినీ విద్యార్థులకు గుర్తింపుకార్డు ఉండాలని, వారినే హాస్టల్‌లోకి అనుమతించాలన్నారు.

చాలా బాలుర హాస్టళ్లల్లో బయటి విద్యార్థులు వచ్చి ఉంటున్నారని, ఇది సహించరాని విషయమన్నారు. విద్యుత్ కోతలతో బాలికల హాస్టళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వార్డెన్లు డీడీ దృష్టికి తీసుకురాగా.. అలాంటి చోట్ల ఇన్వర్టర్లు, జనరేటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాలికలకు ప్రతి నెలా పీహెచ్‌సీ వైద్యులచే పరీక్షలు చేయించాలని వార్డెన్లు కోరగా డీఎంహెచ్‌ఓకు లేఖ రాస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement