ఆత్మనిర్భర్‌ ఆర్థిక ప్యాకేజీపై నీలం సాహ్ని సమీక్ష | Sakshi
Sakshi News home page

‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని’

Published Mon, May 18 2020 4:46 PM

Nilam Sahni Review Meeting On Atmanirbhar Bharat Abhiyan In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీతో ఏఏ శాఖలకు ఎంత మేరకు నిధులు సమకూరుతాయే అంచనా వేసి తద్వారా వివిధ పథకాలన్నీ ప్రజలందరికీ లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ప్యాకేజీ అమలుపై సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తూనే.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కపేదవారికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. (‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’)

ఈ విషయమై వచ్చే సమావేశంలో సవివరంగా చర్చిద్దామని ఆలోగా శాఖల వారీ పూర్తి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. అంతకుముందే ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రంలోని వివిధ శాఖలకు కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమాభివృధ్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి బీ ఉదయలక్ష్మి, ఇంధన, మున్సిపల్ పరిపాలన శాఖల కార్యదర్శులు ఎన్‌. శ్రీకాంత్, జే శ్యామలరావు, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం వారి వారి శాఖలకు సంబంధించి ఎంతమేరకు ఆర్ధిక ప్యాకేజి లబ్ధి కలుగుతుందనే వివరాలను తెలియజేశారు. కాగా ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, ఎస్ఎల్బిసి కన్వీనర్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!)

Advertisement
Advertisement