రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించాలి: మైసూరా

Mysura Reddy Press Meet About Water Supply For Rayalaseema - Sakshi

సాక్షి, కడప: గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించే ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రేటర్‌ రాయలసీమ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్‌, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలతో కలిసి మైసూరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమలోని 7 ప్రాజెక్ట్‌లకు నీటిని తరలించాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

పట్టిసీమ ప్రాజెక్ట్‌ వల్ల సీమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మైసూరా రెడ్డి. బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టాలన్న అంశంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top