అయ్యో పాపం.. ఆడపిల్ల

A Mother leaves her New Born Baby In Chirala - Sakshi

నాగరిక ఎంత అభివృద్ధి చెందినా... సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా ఈ లోకంలో ఆడ జన్మకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కనటానికి తల్లి నరక బాధను అనుభవిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన శిశువును నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లింది. రోడ్డుపై మాంసం ముద్దలా విగత జీవిగా పడి ఉన్న ఆ శిశువును చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. చందాలు వేసుకుని మరీ ఆ శిశువుకు దహన సంస్కారాలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం చీరాలలో చోటుచేసుకుంది. 

సాక్షి, చీరాల రూరల్‌(ప్రకాశం) :  అది చీరాల పట్టణంలోని విఠల్‌ నగర్‌ ప్రాంతం. ఊరు పేరు తెలియని నిండు గర్భిణి... ఎవరి చేతిలోనైనా మోసానికి గురైందో లేక ఆ తల్లికి ఏ కష్ట మొచ్చిందో తెలియదు బుధవారం రాత్రి స్థానిక రెడ్డిగారి స్కూలు వద్దకు  చేరుకుంది. నా అనేవారు ఎవరూలేని ఆ అభాగ్యురాలు స్కూలు సమీపంలోని రహదారిపై ఏ సమయంలో పురుడు పోసుకుందో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే మృత శిశువును చూసిన స్థానికులు తీవ్ర కలత చెందారు. పేగు కూడా కత్తిరించని స్థితిలో మాతృమూర్తి కడుపులోని అవయవాలు కూడా రోడ్డుపైనే పడివున్నాయి.

అప్పటికే ఆ ఆడ శిశువు అచేతనంగా రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యన్ని చూసిన స్థానికులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొందరు మహిళలు కంటతడి పెట్టారు. తలో కొంత డబ్బులు చందాలు రూపంలో వసూలు చేసుకుని గురువారం ఆ శిశువుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం కాకూడదని ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నా మానవత్వాన్ని మరచిన కొందరు కఠిన హృదయులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం శోచనీయం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top