రూ.750 కోట్లతో ఆధునిక పనిముట్లు | Sakshi
Sakshi News home page

రూ.750 కోట్లతో ఆధునిక పనిముట్లు

Published Thu, May 24 2018 12:04 PM

Modern Tools With 750Crores In Kurnool Aadharana 2 Programme - Sakshi

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పథకం–2 ద్వారా బీసీ కుల వృత్తులకు ఆధునిక పనిమట్లు అందించేందుకు ప్రభుత్వం రూ.750 కోట్లను వెచ్చిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. బుధవారం స్థానిక ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆదరణ పథకం ద్వారా బీసీ కుల వృత్తులకు ఆందించేందుకు ఆధునిక పనిముట్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..ఆదరణ –2 పథకానికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న బీసీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో నెల రోజులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ..

సంక్షేమ పథకాల ద్వారా బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఆదరణ పథకం ద్వారా జిల్లాలో 22,500 మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ తెలిపారు. ఆధునిక పనిమట్లును 90 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, శాలివాహన, వాల్మీకి, వడ్డెర ఫెడరేషన్ల చైర్మన్లు తుగ్గలి నాగేంద్ర, బీటీ నాయుడు, దేవళ్ల మురళీ, బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లికార్జున, ఈడీ కే లాలా లజపతిరావు , జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఆయా కార్యాలయాల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఆదరణ సభ ఆంతరాయం ఏర్పడింది. షామియానాల నుంచి వర్షపు నీరు సభా వేదిక మీదకు పడడంతో అందరూ చెల్లాచెదురయ్యారు.  వర్షంలోనే డిప్యూటీ సీఎం కేఈ కొద్ది సేపు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement