సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు.
జీలుగుమిల్లి, (జంగారెడ్డిగూడెం), న్యూస్‌లైన్:
సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో 48 గంటలపాటు నిర్వహించిన రహదారుల దిగ్బంధనం కార్యక్రమం విజయవంతమైంది. గురువారం జీలుగుమిల్లిలో జరిగిన దిగ్బంధనం కార్యక్రమంలో బాలరాజు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నీటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. అయితే విభజన ద్వారా సీమాంధ్రులను హైదరాబాద్ నుంచి దూరం చేయాలని చూడటం బాధాకరమన్నారు. మహానేత వైఎస్సార్ పాలనలో ఎవరూ విభజన ఊసు ఎత్తలేదని, ఆయన మరణానంతరం రాష్ట్ర పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్లు, సీట్ల కోసం నాయకులు వేర్పాటు వాదాన్ని తెరపైకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేశారన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవిరళ కృషి చేస్తున్నారన్నారు. చింతలపూడి సమన్వయకర్త కర్రా రాజారావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ఉదయం 10 గంటల నుంచి జగదాంబ సెంటర్‌లో జాతీయ, రాష్ట్ర రహదారిపై అడ్డంగా టెంట్ వేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. జీలుగుమిల్లికి చెందిన కోలాట భజన బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహాన్ని నింపారు. పార్టీ మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. నాయకులు కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, జీలుగుమిల్లి సర్పంచ్ ఎం.రామచంద్రరావు, సరిపల్లి సత్యనారాయణరాజు, ఎస్సీసెల్ నాయకుడు సిర్రి మోహన్, కక్కిరాల చంద్రరావు, కె.రాము, ఎం.వెంకన్నబాబు, గుడెల్లి సూర్యచంద్రం, షామిల్‌భాష, వల్లం వసంత్, మామిళ్ల కనకరాజు, పాముల ప్రసాద్, జంగారెడ్డిగూడెం నాయకులు కొయ్య లీలాధరరెడ్డి, లక్కవరం మైనార్టీ సెల్ మస్తాన్ వలీ, వీరాస్వామి పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్న బాలరాజును, వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఆసమయంలో కొద్దిసేపు తోపులాట జరిగింది.