విద్యార్థులకు పసుపు రంగు దుస్తులా..?

MLA Rajanna Dora Slams Collector in Vizianagaram - Sakshi

స్పోర్ట్స్‌ డ్రస్‌లు ఇవ్వకుండా పార్టీ రంగు సూచించే దుస్తులు ఎలా ఇస్తారు..

టీడీపీ తీరుపై కలెక్టర్, డీఈఓ బదులివ్వాలి..

ఎమ్మెల్యే రాజన్నదొర

విజయనగరం ,సాలూరు: విద్యార్థులకు స్పోర్ట్స్‌ డ్రస్‌ల స్థానంలో టీడీపీ నాయకులు తమ పార్టీ రంగు సూచించే దుస్తులు పంపిణీ చేయడాన్ని ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు రాజన్నదొర తప్పుబట్టారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,  సాలూరు మండలంలోని మామిడిపల్లి హైస్కూల్‌ విద్యార్థులకు టీడీపీ నాయకులు టీడీపీ డ్రస్‌లను పంపిణీ చేశారన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో ఐక్యత ఉంటుందా అని ప్రశ్నించారు. విద్యాసంస్థలను రాజకీయాలకు వేదికగా చేస్తారా?.. హైస్కూళ్లను పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తారా అంటూ మండిపడ్డారు. పిల్లలతో పార్టీలకు ప్రచారం చేయిస్తే కేసులు నమోదైన సంఘటనలున్నాయి.. అలాంటిది ఏకంగా పాఠశాలలో డ్రస్‌లు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య ప్రాతినిథ్య చట్టం, ఎన్నికల నియమావళికి పూర్తి వ్యతిరేకమన్నారు.

కలెక్టర్, డీఈఓ బదులివ్వాలి..
ఈ విషయమై జిల్లా కలెక్టర్, డీఈఓ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రాజన్నదొర డిమాండ్‌ చేశారు. పార్టీ డ్రస్‌లను పంపిణీ చేసిన సాక్షి కథనాన్ని, ఫొటోలను చూపారు. హైస్కూళ్లలో విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వర్తించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే ఇతర పార్టీలతో సహా వైఎస్సార్‌సీపీకి కూడా పార్టీ డ్రస్‌లను ఇచ్చేందుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని లేకపోతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.  సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ సాలూరు మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ, పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి సలాది అప్పలనాయుడు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top