గీతకు షాక్

గీతకు షాక్ - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రత్యామ్నాయం లేక పార్టీలోకి వచ్చేవారికి అంత రాచమర్యాదలు అవసరం లేదని టీడీపీ క్యాడర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్  మీసాల గీత టీడీపీలో చేరికను అట్టహాసం చేయడకూదని భావించినట్లు సమాచారం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా వేసుకునే అవకాశం  ఆమెకు దక్కనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ చంద్రబాబు రాకకోసం వేచి చూసినా ఆ అవకాశం దక్కక పోవడంతో గత్యంతరం లేక సోమవారం  ఆమె సాదాసీదాగా పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

 

 అంచనాలు తలకిందులు

 టీడీపీ అధినేత వచ్చినప్పుడు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులను పార్టీలోకి చేర్చుకుని, కండువాలు వేయాలని భావించారు. మీసాల గీతతో పాటు జిల్లాకు చెందిన ఒక దళిత నేత, ఉద్యమాలు నిత్యం చేసే నేతతో పాటు పలువుర్ని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. మరో ప్రత్యామ్నాయం లేని మీసాల గీత తప్ప మరెవరూ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తానికి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న గీతకు చంద్రబాబు పర్యటన వాయిదాల పర్వంతో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికైతే గతనెల 30న చంద్రబాబు జిల్లాకొస్తున్నారని, ఆ రోజు పార్టీలో చేరవచ్చని భావించారు. కానీ ఆ పర్యటన ఫిబ్రవరి 10కి వాయిదా పడింది. పోనీలే అదే రోజున చేరుదామని చూసినా మళ్లీ వాయిదా పడడంతో ఆమెకు నిరుత్సాహం ఎదురైంది. చివరికి ఈనెల 26న చంద్రబాబు పర్యటన ఖరారైంది. అప్పుడే చేరవచ్చని ఉవ్విళ్లూరారు. కానీ, విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల వ్యతిరేకత నేపథ్యంలో ఆశలకు బ్రేక్ పడింది. 

 

 ఆమెకు టికెట్ ఇస్తే ఒప్పుకోం

 ఎమ్మెల్యే టికెట్ ఆశతో మీసాల గీత పార్టీలోకి వస్తున్నారని, ఆమెను ఎమ్మెల్యేగా నిలబెడితే తాము ఒప్పుకోబోమని, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కరాఖండిగా చెబుతున్నారు. ఆమెకి టికెట్ ఇస్తే తామంతా ఏమై పోవాలని, ఆమె వెంట పనిచేయలేమని తేల్చి చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ గజపతిరాజునే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని, కాదూకూడదంటే ఆయన భార్య, కుమార్తెల్లో ఎవరో ఒకరిని బరిలోకి దించాలని నియోజకవర్గ నాయకులు పట్టుబడుతున్నారు. ఒకవేళ అశోక్ గజపతి రాజు ఎంపీగా పోటీ చేయడానికి మొగ్గు చూపిస్తే ఎన్నాళ్లుగానో పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. ఈ క్రమంలో ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు నర్సింగరావు తదితరులు టికెట్ రేసులో తామున్నామంటూ ముందుకొచ్చారు. ఇప్పటికే అశోక్ గజపతిరాజు వద్ద ప్రతిపాదనలు పెట్టారు. దీంతో మీసాల గీతకు పార్టీలోకి రాకముందే అసమ్మతి సెగ లు ఆహ్వానం పలుకుతున్నాయి. 

 

 నెట్టుకు రాగలరా? 

 మీసాల గీత టీడీపీలో చేరితే అభ్యంతరం లేదని, కానీ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేంత సీన్ ఆమెకు లేదని, నియోజకవర్గ కేడర్ నిశ్చయించుకుంది. ఈ పరిస్థితులన్నీ పార్టీ దూతల ద్వారా తెలుసుకున్నారో, వ్యతిరేకతను గమనించారో తెలి యదుగాని చంద్రబాబు జిల్లా పర్యటనకొస్తున్న రెండు రోజుల ముందు(ఈనెల 24న) ఆదరాబాదరాగా మీసాల గీత పార్టీలో చేరిపోనున్నారు. మీసాల గీతకు ఆదిలోనే ఇటువంటి పరి ణామాలు ఎదురవుతుంటే భవి ష్యత్తులో ఆమె పార్టీ కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ నెగ్గు కు రాగలరా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top