
ట్యూటర్లు.. జీతగాళ్లు!
సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, హిందీ సబ్జెక్టులను బోధించే ట్యూటర్ల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎస్సీ హాస్టళ్లలో వింత
* 2014 నవంబర్ నుంచి విడుదల కాని బడ్జెట్
* గత ఏడాది రెండు క్వార్టర్లకు రూ. 7.19 లక్షలు విడుదల
* ఇప్పటికీ విడుదల కాని రూ.30 లక్షలు
* ఒక్క నెల జీతంతో పడరాని పాట్లు
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, హిందీ సబ్జెక్టులను బోధించే ట్యూటర్ల పరిస్థితి దయనీయంగా మారింది. నెల జీతం రూ.1500లే అయినా.. చెల్లింపు విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 2014 నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది.
జిల్లా అధికారుల అభ్యర్థన మేరకు 2015 ఆగస్టు, నవంబర్ నెలల్లో రెండు క్వార్టర్లకు కలిపి రూ.7.19 లక్షలను మాత్రం వీరి జీతాలకు బడ్జెట్ విడుదలైంది. ఈ మొత్తం ఒక్క నెల జీతానికే సరిపోయింది. ఇదేమని అడిగితే.. సర్దుకోవాలనే సమాధానం వస్తోందని ట్యూటర్లు వాపోతున్నారు.
నిరుద్యోగులతో చెలగాటం
జిల్లాలోని 51 సాంఘిక సంక్షేమ ప్రత్యేక వసతి గృహాల్లో నలుగురు చొప్పున మొత్తం 204 మంది ట్యూటర్లు 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.1500 ప్రకారం గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. అయితే వీరి గౌరవ వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఏడాది కాలంగా బడ్జెట్‌ను విడుదల చేయకపోవడం గమనార్హం. 204 మందికి నెలకు రూ.3.06 లక్షల ప్రకారం ఇప్పటి వరకు రూ.36.72 లక్షలను చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం 2015 జూన్‌లో మొదటి క్వార్టర్‌గా రూ.3.57 లక్షలు, నవంబర్‌లో రెండవ క్వార్టర్‌గా రూ.3.62 లక్షలను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది.
విడుదలైన ఈ మొత్తంలో ఒక్కో ట్యూటర్‌కు ఒక నెల జీతం అందగా.. ఇంకా 11 నెలల జీతం పెండింగ్‌లో పడింది. సంక్షేమ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థుల ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం టూటర్లను ఏర్పాటు చేసినా, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. మెజారిటీ ట్యూటర్లు డీగ్రీ, పీజీ, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులే. ప్రభుత్వం అతి తక్కువ గౌరవ వేతనం ఇస్తున్నా, వచ్చే కొంచెం మొత్తంతోనే పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు, అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పాటు సబ్జెక్టులు రివిజన్ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని విధులు నిర్వహిస్తున్నారు.
బడ్జెట్ విడుదల చేయాలని కోరాం
హాస్టళ్లలోని ట్యూటర్ల గౌరవ వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేయాలని ఉన్నతాధికారులను కోరాం. గత ఏడాది రెండు క్వార్టర్లలో విడుదలైన మేరకు అందించడం జరిగింది. హెడ్ ఆఫ్ అకౌంట్స్‌లో బ్యాన్ ఉన్న కారణంగా బడ్జెట్ విడుదలలో జాప్యం జరుగుతోంది.
- డీడీ యు.ప్రసాదరావు