భూ తగాదేనా? | killed by land purpose | Sakshi
Sakshi News home page

భూ తగాదేనా?

Apr 3 2014 2:27 AM | Updated on Sep 2 2017 5:29 AM

హిందూపురం మండలం సంతేబిదనూరు పంచాయతీ తుంగేపల్లిలో అర్చక దంపతులు సుధాకర్‌స్వామి(66), శ్యామలమ్మ(55)లు భూతగాదాల వల్లే హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హిందూపురం టౌన్, న్యూస్‌లైన్ : హిందూపురం మండలం సంతేబిదనూరు పంచాయతీ తుంగేపల్లిలో అర్చక దంపతులు సుధాకర్‌స్వామి(66), శ్యామలమ్మ(55)లు భూతగాదాల వల్లే హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తూముకుంట చెక్‌పోస్టులోని వెంకటరమణస్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్న సుధాకర్ స్వామి, అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఆయన భార్య శ్యామలమ్మలు హత్యకు గురయ్యారనే సమాచారం బుధవారం ఉదయం తెలియగానే మండలంలో కలకలం రేగింది.
 
 మంగళవారం రాత్రి వారు హత్యకు గురయ్యారు. సుధాకర్‌స్వామి తండ్రి కరణంగా పని చేసేవారు. వీరికి 50 ఎకరాలకుపైగా భూమి ఉండేది. ఈ భూమిని ఇతరులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ భూమి వివాదంపై సుధాకర్‌స్వామి కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. హత్య సమయంలో సుధాకర్‌స్వామి కాళ్లకు బూట్లు ఆదరాబాదరాగా వేసుకున్నట్లు తెలుస్తోంది. సుధాకర్‌స్వామికి కాళ్ల నొప్పులు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
 
 దుండగుల దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి గడ్డి వామిలోకి పోయి ఉండవచ్చని లేదా దుండగులే మాట్లాడడానికి సుధాకర్‌స్వామిని గడ్డివామి వద్దకు తీసుకెళ్లి హత్య చేసిఉండవచ్చని భావిస్తున్నారు. సుధాకర్‌స్వామిని హత్య చేసిన తరువాత ఇంట్లో ఉన్న శ్యామలమ్మను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అనంతరం భూమికి సంబంధించిన పత్రాల కోసం బీరువాను సోదా చేసినట్లు తెలుస్తోంది. దొంగలేమైనా ఈ ఘటనకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement