కొత్త కలెక్టర్‌గా కాటమనేని?

Katamaneni bhaskar as new collector for visakhapatnam - Sakshi

ప్రస్తుత కలెక్టర్‌కు త్వరలో బదిలీ

సుదీర్ఘకాలం జిల్లాలోనే పని చేసిన ప్రవీణ్‌కుమార్‌

దాంతో ఆయన బదిలీ తప్పదని సంకేతాలు

ప్రయత్నాలు ముమ్మరం చేసిన సీనియర్‌ ఐఏఎస్‌లు

యువ అధికారి కాటమనేని భాస్కర్‌వైపు సర్కారు మొగ్గు

నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘ కాలం పాటు విశాఖలోనే వివిధ హోదాల్లో పనిచేసిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ త్వరలో బదిలీకానున్నారు. నెలాఖరులోగా బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పలువురు ఐఏఎస్‌ అధికారులు ఇక్కడికి వచ్చేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా ఐదుగురు ఐఏఎస్‌లు ఈ పోస్టుపై కన్నేసినప్పటికీ యువ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 

జేసీగా వచ్చి..
జాయింట్‌ కలెక్టర్‌గా వివాఖ వచ్చిన ప్రవీణ్‌కుమార్, ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా, ప్రస్తుతం కలెక్టర్‌గా.. ఇలా ఒకే జిల్లాలో మూడు కీలక పదవుల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఐఏఎస్‌ అధికారి మరే జిల్లాలో లేరు. హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో జేసీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌తో కలిసి సహాయ, పునరావాస చర్యల్లో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా ఏడాదిన్నర పాటు పనిచేసిన ఆయన స్మార్ట్‌ సిటీగా విశాఖకు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. 2016 జూలై 25న కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించారు.

భూ కుంభకోణాన్ని బయటపెట్టి..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల భాగోతాన్ని బయటపెట్టి ఒక విధంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. కలెక్టరే స్వయంగా రూ.2,200 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పడం విపక్షాలకు ఆయుధమైంది. ఆ తర్వాత వరుసగా వెలుగు చూసిన భూ కుంభకోణాలు.. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. వరుసగా మూడుసార్లు భాగస్వామ్య సదస్సులు, అగ్రిటెక్‌తో పాటు ఫ్లీట్‌ రివ్యూ వంటి జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలు, వేడుకలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లాపై తనదైన ముద్ర వేశారు. గత ఏడాది భూ కుంభకోణాలు వెలుగు చూసిన సమయంలోనే ప్రవీణ్‌కుమార్‌ బదిలీపై ఊహాగానాలు విన్పించాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడోసారి భాగస్వామ్య సదస్సు ఉన్నందున అప్పటివరకు కదపకూడదని భావించిన ప్రభుత్వం కలెక్టర్‌ బదిలీ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. సదస్సు ముగిసినప్పటి నుంచి మళ్లీ ప్రవీణ్‌ కుమార్‌ బదిలీపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌కు బదిలీ తప్పదని ప్రభుత్వం సంకేతాలు కూడా ఇచ్చింది.

ఎవరి ప్రయత్నాల్లో వారు
నెలాఖరులోగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలుంటాయని తెలుస్తోంది. ఎప్పుడు ఈ పోస్టు ఖాళీ అవుతుందా? ఎప్పుడు వద్దామా? అని పలువురు సీనియర్లు గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తామేమీ తీసిపోమన్నట్టుగా నిన్నగాక మొన్న కలెక్టర్‌ పోస్టు అందుకున్న వారు సైతం ఈ జాబితాలో చేరారు. రెండేళ్లుగా ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్నతో సహా పలువురు ఐఏఎస్‌లు ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం కడప కలెక్టర్‌గా ఉన్న బాబూరావునాయుడు, సత్యనారాయణ, కార్తికేయ మిశ్రాలు ఆశావహుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం యువ అధికారి కాటమనేని భాస్కర్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈయన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సుమారు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌తో పాటు జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ కూడా బదిలీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈయన కూడా వచ్చి మూడేళ్లు కావస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top