ఎమ్మెల్యే రాపాక అరెస్టు.. విడుదల 

Janasena MLA Rapaka Varaprasad Arrested And Released On Bail - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(రాజోలు) : చట్టం ముందు అందరూ సమానమేనని ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ అన్నారు. మలికిపురం పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం ఆయన వచ్చారు. ఈ నెల 11న ఈ స్టేషన్‌ వద్ద జరిగిన ఆందోళనలో ధ్వంసమైన అద్దాలను పరిశీలించారు. పేకాడుతున్న వారి అరెస్ట్‌ నేపథ్యంలో, రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ఎస్సై కేవీ రామారావు మధ్య వివాదం కారణంగా ఏర్పడిన ఘర్షణ వివరాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు తప్పు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు ఉందన్నారు. ఫిర్యాదులపై విచారణ చేసి తప్పు చేసిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు.

అలా కాకుండా ఎమ్మెల్యే స్టేషన్‌ వద్ద ధర్నా చేయడం, అనుచరులతో స్టేషన్‌పై దాడి చేయడం తగదన్నారు. ఇది యువతను తప్పు తోవ పట్టించి ప్రభుత్వం, వ్యవస్థల పట్ల తప్పుడు సంకేతాలు పంపడమేనని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులందరిపైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట రాజోలు సీఐ మోహన్‌ రెడ్డి, ఎస్సై రామారావు ఉన్నారు. ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైన నేపథ్యంలో మలికిపురంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. 

కాకినాడ క్రైం: మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో నిందితులు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు ఎనిమిది మందిని మంగళవారం రాజోలు సీఐ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి మంగళవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. అనంతరం వీరిని బెయిల్‌పై విడుదల చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులోని వారు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే బెయిల్‌ రద్దు అవుతుందని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తెలిపారు.   

‘చిన్న విషయమని పవన్‌కల్యాణ్‌ ప్రకటించడం విచారకరం’
మలికిపురం: స్థానిక పోలీస్‌ స్టేషన్‌పై దాడి సంఘటన.. జనసేన ఎమ్మెల్యే రాపాక, పోలీసుల మధ్య ఏర్పడిన వివాదమే తప్ప ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు అన్నారు. ఈ విషయంపై కొందరు తమ పార్టీని విమర్శించడం తగదని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. పేకాడుతున్న వారిని అరెస్ట్‌ చేస్తే ఆందోళన చేసిన జనసేన నేతలపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. జనసేన నేతలు స్టేషన్‌పై దాడి చేసి, దగ్ధం చేయడాన్ని సమర్థించడం పవన్‌కళ్యాణ్‌కు తగదని, ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డి లలిత్‌కుమార్, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మంగెన సింహాద్రి, సొసైటీ చైర్మన్లు దివ్వి చిట్టిబాబు, బెల్లంకొండ సూరిబాబు ఏఎంసీ మాజీ చైర్మన్‌ గెద్దాడ సత్యనారాయణ, ఎస్‌.శాంతికుమారి, రాయుడు విజయకుమార్, ఓగూరి హనుమంతరావు, చేట్ల సత్యనారాయణ, మేడిది రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top