
ఆ 18 అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా?
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించి 18 అంశాలపై వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోర్టులో పిటిషన్ వేశారని, ఆ అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా? అని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఎంవి మైసూరా రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించి 18 అంశాలపై వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోర్టులో పిటిషన్ వేశారని, ఆ అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా? అని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఎంవి మైసూరా రెడ్డి ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. చంద్రబాబు బహిరంగ చర్చకు వస్తే అన్ని బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు మరొకరిమీద అవినీతి ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్లు తనవైపు చూపిస్తాయన్న విషయం చంద్రబాబు తెలుసుకుంటే మంచిందని సలహా ఇచ్చారు.
రాష్ట్ర విభజన బిల్లు రాజ్యాంగ స్పూర్తిని ఎగతాళి చేసేలా ఉందన్నారు. రాష్ట్రపతి విభజన బిల్లు పంపిన విధానం, దానిపై అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఈ నెల 3న తమ పార్టీ బంద్కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మోటారు బైక్ ర్యాలీలు, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు రిలేదీక్షలు చేస్తామని వివరించారు. శాసనసభలో జరిగే పరిణామాలను బట్టి తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
తెలంగాణ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని తెలిపారు. శాసనసభలో సమైక్యతీర్మానం కోసం పట్టుబడతామని చెప్పారు. ఇప్పటికైనా అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలే విభజనకు బాధ్యులని ఆయన అన్నారు. తకు సీఎం కిరణ్ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము అనుసరించాల్సిన వ్యూహం తమకు ఉందని మైసూరారెడ్డి తెలిపారు.