‘ఇందిరమ్మ’ బిల్లుల అవకతవకలపై విచారణ | inquiry on indiramma bills irregularities | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ బిల్లుల అవకతవకలపై విచారణ

Feb 21 2014 11:33 PM | Updated on Mar 28 2018 10:59 AM

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాల నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

మంచాల, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాల నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మండల పరిధి దాద్‌పల్లి గ్రామం, వెంకటేశ్వర తండాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై ఈ నెల 5న సాక్షి దినపత్రికలో ‘గుటకాయస్వాహా!’ శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. హౌసింగ్ జిల్లా తూర్పు డివిజన్ ఈఈ పరిపూర్ణాచారి, జిల్లా ప్రత్యేక హౌసింగ్ అధికారి ఎస్.విజయ్, ఏఈ రాంచంద్రయ్య శుక్రవారం మధ్యాహ్నం దాద్‌పల్లి గ్రామానికి వచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు.

బాధితురాలు మందుల బీరమ్మ ను విచారించగా...

ఇల్లు బేస్మెంట్ వరకు కట్టినా నయాపైసా బిల్లు ఇవ్వలేదని తెలిపింది. ఉపసర్పంచ్ నర్సింగ్‌రావు తన బ్యాంకు ఖాతా పుస్తకం తీసుకెళ్లారని, తనకు తెలియకుండానే తన ఖాతాలో రూ.43,650 జమకాగా వాటిని తీసుకున్నారని ఆరోపించింది. తాను ఇల్లు పూర్తిగా కట్టుకోకున్నా డబ్బులు ఎందుకు తన ఖాతాలో జమ చేశారు, వాటిని వేరేవారికి బ్యాంకు అధికారులు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసింది. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది. అనంతరం హౌసింగ్ అధికారులు వెంకటేశ్వరతండాకు వెళ్లి జాట్రోత్ మారు అనే గిరిజన మహిళను విచారించారు. తనకు బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉందని, ఇంతవరకూ ఇల్లు కట్టుకోలేదని తెలిపింది.

అయితే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పడంతో ఎంపీటీసీ మాజీ సభ్యుడు వెంకటేశ్‌గౌడ్‌కు బ్యాంకు ఖాతా పుస్తకం ఇచ్చానని, తనకు తెలియకుండానే ఖాతాలో జమ అయిన రూ.65వేలు తీసుకున్నారని అధికారుల దృష్టికి తెచ్చింది. ఇరువురు బాధితుల నుంచి హౌసింగ్ అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదులు తీసుకున్నారు. వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాగా అధికారుల విచారణ తీరుపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఏదో కంటితుడుపు చర్యగా ఇద్దర్ని విచారించి వెళ్లిపోవడం తగదని, బాధితులందర్నీ కలిసి విషయం తెలుసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement