పల్నాడు గనుల్లో బ్లాస్టింగ్‌ మోత | Illegal Mining Mafia Blastings in Palnadu | Sakshi
Sakshi News home page

Nov 19 2018 1:14 PM | Updated on Apr 3 2019 3:55 PM

Illegal Mining Mafia Blastings in Palnadu - Sakshi

కోనంకి గ్రామంలో డిటోనేటర్లు పేలిన ఘటనలో తీవ్ర గాయాలపాలై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తిరుపతిరావు, పక్కన కుటుంబ సభ్యులు

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల అక్రమ మైనింగ్‌కు అడ్డే లేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను బ్లాస్టింగ్‌కు వినియోగిస్తూనే ఉన్నారు. అనుభవం లేని కార్మికులతో బ్లాస్టింగ్‌ చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మైనింగ్‌ మాఫియా ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో డిటోనేటర్లు పేలి క్వారీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చావుబతుకుల మధ్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది కప్పిపుచ్చుకోడానికి రకరకాల కథలు అల్లుతున్నారు. చేపల వేటకు వచ్చి డిటోనేటర్లు పేల్చారంటూ టీడీపీ నేతల డైరెక్షన్‌లో అధికారులు చెబుతుండగా, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు మాత్రం దీపావళి మందులు పేలాయంటున్నారు.

మొక్కుబడిగా సీబీసీఐడీ విచారణ
పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియా భారీ ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగించడమే కాకుండా, విచ్చలవిడిగా నిల్వలు ఉంచుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల సీబీసీఐడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కానీ, వీరు రెండు రోజులకోసారి పిడుగురాళ్ల వచ్చి మిల్లర్లు, లారీ యజమానులు, డ్రైవర్లు, కూలీలను విచారిస్తున్నారే తప్ప మైనింగ్‌ మాఫియా సభ్యుల జోలికి మాత్రం వెళ్లడంలేదు. దీంతో క్వారీల్లో మళ్లీ బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. సీఐడీ అధికారులుగానీ, స్థానిక పోలీస్, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులెవరూ అక్రమ బ్లాస్టింగ్‌లపైగానీ, పేలుడు పదార్థాల నిల్వలపైగానీ చర్యలు తీసుకోవడంలేదు. గత రెండు నెలలుగా పల్నాడు ప్రాంతంలో పేలుడు పదార్థాల నిల్వలు, అక్రమ బ్లాస్టింగ్‌లపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాసు మహేష్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు సీబీసీఐడీ ఏడీజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీబీఐ అధికారులకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఇంత చేస్తున్నా మైనింగ్‌ మాఫియాకు అడ్డుకట్టపడటం లేదు.

జిల్లాలో 25 మందికి పైగా మృతి
మైనింగ్‌ బ్లాస్టింగ్‌ ప్రమాదాల్లో గడిచిన కొన్నేళ్లలో 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2010లో అక్రమ మైనింగ్‌ కోసం నిల్వ ఉంచిన జిలిటెన్‌ స్టిక్స్‌ దాచేపల్లిలో పేలి వ్యాపారి కుటుంబంతో పాటు, చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే 16 మంది మృత్యువాత పడ్డ ఘటన ఇప్పటికీ మరువలేని విషాదం. ఏడాది క్రితం ఫిరంగిపురం క్వారీలో బ్లాస్టింగ్‌కు యత్నిస్తుండగా రాళ్లు కూలి ఐదుగురు కూలీలు సజీవ సమాధి అయిన ఘటన సంచలనం కలిగించింది. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో మాత్రం కనువిప్పు కలగలేదు. మరోవైపు.. అక్రమ క్వారీయింగ్‌పై రెండు నెలలుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు పేలుడు పదార్థాలు అక్రమంగా తయారుచేస్తున్న వారు ఎవరు.. సరఫరా చేస్తున్న వ్యక్తులు ఎవరనే విషయంపై ఆరా తీయడంగానీ, చర్యలు తీసుకోవడంగానీ చేయకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement