సీఎం జగన్‌ కీలక నిర్ణయం; టీడీపీకి టెన్షన్

Huge Response For Village Secretariat Jobs In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సైతం నోటి మాట లేకుండా చేసింది. రాష్ట్రంలో పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా యువత మొత్తం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తోంది. దీంతో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో తమ పరిస్థితేంటన్న టెన్షన్ టీడీపీకి పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలపైనే చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా ఈ ఉద్యోగాల భర్తీ మారింది. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో లక్షా 33 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద  సంఖ్యలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఒకేసారి జరిగిన సందర్భాలు లేవు.  

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లోనే లక్షా 30 వేలకు పైగా శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం రాజకీయ వర్గాలకు కూడా షాక్‌లా మారింది. ప్రతిపక్ష టీడీపీకి ఈ ఉద్యోగాల భర్తీతో గ్రామాల్లో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఎప్పుడైనా ఇలా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఉందా అని నిరుద్యోగులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీడీపీ నేతలు తెల్లమొహం వేస్తున్నారు. పరిపాలనా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా యువత ఇప్పుడు ఈ ఉద్యోగాల భర్తీపై చర్చించుకుంటున్నారు. 22 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు.

ఈ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో టీడీపీ పుట్టి ముంచబోతుందన్న ఆందోళన చంద్రబాబులో ఇప్పటికే మొదలైంది. ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరోలో కూడా దీనిపై చర్చ జరిగినట్టు సమాచారం. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తే గ్రామాల్లో ఏం చెప్పి ఓట్లు అడగాలన్న ఆందోళన టీడీపీ నేతలు, చంద్రబాబులో వ్యక్తమవుతోంది. ఏదోలా గ్రామ వాలంటీర్లకు రాజకీయ రంగు పులిమేలా విమర్శలు చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించినా అది సాధ్యం కాదని, గ్రామాల్లో కళ్ల ముందు ఉద్యోగాలు కనిపిస్తుంటే తాము చేసే విమర్శలకు ప్రజల్లో స్పందన రావడం లేదని టీడీపీ నేతలే చెప్తున్నారు. ఇక లక్ష 33 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీతో గ్రామాల్లోని పట్టభద్రులైన యువతీ, యువకులు జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. గ్రామ సచివాలయాల నియామకాలపై చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు కూడా చేయడానికి సాహసించలేని పరిస్థితి నెలకొంది. ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి లక్షా 33 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సీఎం జగన్ నిర్ణయంతో టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది.

(చదవండి: సచివాలయ ఉద్యోగాలకు 7రోజుల పాటు పరీక్షలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top