హార్టికల్చర్‌ హబ్‌.. అంతా హుళక్కే

Horticulture Hub .. Everything False - Sakshi

‘వైఎస్సార్‌ జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేస్తామంటే నిజమేనని అనుకున్నాం. లెక్కలేనని ఉప ఉత్పత్తుల పరిశ్రమలు వచ్చేస్తాయని చెప్తే మంచిరోజులొస్తాయని భ్రమపడ్డాం. అదుగో ఉద్యాన పంట ఉత్పత్తులు కొనేందుకు దేశీయ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయంటూ హోరెత్తిస్తే నిజమేననుకున్నాం. అవన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డే మమ్మల్ని బురిడీ కొట్టించారు. మా ఉద్యాన రైతుల ఆశలను అడియాశలు చేశారు’ అని వైఎస్సార్‌ జిల్లా రైతులు గోడు వెల్లబోసుకున్నారు. ‘సీఎం, మంత్రి జిల్లాకు వచ్చినప్పుడల్లా హార్టికల్చర్‌ హబ్‌ అంటూ ఊదరగొట్టారు. గిట్టుబాటు ధర లేకపోతే రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి తామే పంటను కొంటామని భరోసా ఇచ్చారు. ఆ హామీలన్నీ గాలి మూటలయ్యాయి. మాకు తీవ్ర అన్యాయం చేశారు’ అని వైఎస్సార్‌ జిల్లా లింగాల మండల కేంద్రంలో ‘సాక్షి’ నిర్వహించిన రచ్చబండలో రైతులు వాపోయారు. 

సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి దారుణంగా మోసగించారు. ఉప ఉత్పత్తుల పరిశ్రమలు ఎక్కడ? రూ.4వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అంటూ ఎందుకు మోసగించారు?

రచ్చబండలో రైతులు ఏం చెప్పారంటే..
జిల్లాలో 36 రకాలకు పైగా ఉద్యాన పంటల్ని పండిస్తున్నాం. పక్క జిల్లాలో పలు రకాల కంపెనీలను తీసుకువచ్చి దిగుబడుల్ని కొనుగోలు చేయిస్తున్నారు. అందుకు బడ్జెట్‌లో రూ.45 కోట్లు అదనంగా కేటాయించారు. రైపనింగ్‌ చాంబర్లు, కోల్డ్‌ స్టోరేజీలు, గ్రేడింగ్‌ యూనిట్లు, ఉప ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. మా జిల్లాపై మాత్రం చిన్న చూపు చూశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లో పులివెందుల అరటి, వీరబల్లి బేనిషా మామిడికి మంచి పేరుంది. జిల్లా నుంచి ఢిల్లీ, ముంబై, నాగపూర్, చెన్నై, వేలూరు, హైదరాబాద్, బెంగళూరు, పుణే, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ మార్కెట్లకు మేమే సొంత ఖర్చులతో ఎగుమతి చేస్తున్నాం’ అని ఓ రైతు ఇక్కట్లను ఏకరువు పెట్టాడు. మరో రైతు అందుకుంటూ ‘జిల్లాలో 1.11 లక్షల హెక్టార్లలో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, జామ, దానిమ్మ, సపోటా, పూల తోటలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నాం. ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో ఏటా రూ. 600 కోట్లు నష్టపోతున్నాం. మార్కెటింగ్‌ లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. గిట్టుబాటు ధర లేనప్పుడు విలువ ఆ«ధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన గ్రేడింగ్, ప్రాసెసింగ్, జ్యూస్, పల్ప్, పౌడర్‌ పరిశ్రమల యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. దీంతో అయినకాడికి అమ్ముకుంటున్నాం. జిల్లాలో అరటి కోసం బనానా కోల్డ్‌ చైన్‌ పేరిట రూ.5–6 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి ఐదేళ్లవుతున్నా వాటికి దిక్కూమొక్కూలేవు. అపెడా, వాల్‌మార్ట్, ఫ్యూచర్‌ గ్రూప్స్, ఐఎన్‌ఐ కంపెనీలు జిల్లాకు వస్తున్నాయంటూ ఆశలు కల్పించినా ఒక్క కంపెనీ కూడా రాలేదు’ అని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, అరటి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయల పంటలు సాగు చేసే రైతులతో 52 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటైనా, మా గ్రూపుల వద్దకు వచ్చి ఇంతవరకూ పంటను కొనుగోలే చేయలేదని ఇంకొకరు వాపోయారు.

జిల్లాలో సాగవుతున్న పండ్ల తోటలు (హెక్టార్లలో) 1,11,254
పండ్ల తోటల నుంచి దిగుబడి (టన్నుల్లో) 28,47,519
పంట ఉత్పత్తుల ఆదాయం (రూ. కోట్లలో) 1,775
పరిశ్రమలు లేక నష్టపోతున్న మొత్తం (రూ. కోట్లలో) 600

గ్రూపు ఏర్పాటైనా  ఒరిగిందేమీ లేదు
ప్రభుత్వం ఊరించడం తప్ప ఉద్యాన రైతుకు చేసిందేమీలేదు. అరటి, మామిడి, బొప్పాయి రైతులు గ్రూపులుగా ఏర్పాటవ్వాలని చెప్పారు. ఇంతవరకు ఒక టన్ను కూడా కొనుగోలు చేయలేదు. ప్రత్యేక పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. ధరల స్థిరీకరణ నిధిని రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పినా అది ఏమైందో ముఖ్యమంత్రికే తెలియాలి. ప్రతి ఏటా తక్కువ ధరకు అరటి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. 
–కె.చంద్రశేఖరరెడ్డి, లింగాల

ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఒక్కటీ రాలేదు
అరటి నుంచి జ్యూస్, క్రీములు, వడియాలు, నారు, పేపరు ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయని సీఎం పార్నపల్లె లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు గొప్పలు చెప్పారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. నాలుగైదు రోజులు నిల్వ ఉన్నా చెడిపోనంత నాణ్యత కలిగిన కాయలు ఇక్కడి ప్రత్యేకత. సీఎం మాటలు చెప్పడం తప్ప ఉద్యాన రైతులకు చేసిందేమీ లేదు. 
–ఎంసీ శేఖరరెడ్డి, లింగాల

హార్టికల్చర్‌ హబ్‌ లేదు.. అంతా ఉత్తిదే
హార్టికల్చర్‌ హబ్‌ వస్తుంది. పరిశ్రమలు, ఉప పరిశ్రమలు వస్తాయని ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. పంటకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశించాం. అవేమీ రాలేదు. చివరకు దళారులను ఆశ్రయించి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.  
– అలవలపాటి ప్రతాప్‌రెడ్డి, లింగాల

మార్కెట్‌ సదుపాయం కల్పించకుండా దగా 
లింగాల మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సార్లు వచ్చారు. ఇక్కడి రైతులు బంగారం పండిస్తున్నారని, అరటికి మార్కెట్‌ సదుపాయం కల్పిస్తామని, రైతులను లక్షాధికారుల్ని చేస్తామని నమ్మబలికారు.
 – ఎ.శంకరరెడ్డి, లింగాల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top