హైపర్‌ రియలిస్టిక్‌ ‘బ్రహ్మ’

High Resolution Painter Brahma Special Interview - Sakshi

చిత్రకళనే ఊపిరిగా చేసుకున్న యేలూరి శేషబ్రహ్మం

రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్‌ మెడల్స్‌

అంతర్జాతీయ కళాకారుల నుంచి ప్రశంసలు

తిరుమలేశుని నేత్రదర్శనం పెయింటింగ్‌ వేసిన ఘనత బ్రహ్మానిదే

హైపర్‌ రియలిజం.. హై రిజల్యూషన్‌ చిత్రాలను పోలి ఉండే చిత్రలేఖనం లేదా శిల్పశైలి. ఇది అంత తేలికైన కళేం కాదు. 1970లో యూరోప్, అమెరికాలో అభివృద్ధి చెందిన ఈ కళ..ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హైపర్‌ రియలిజం ఆర్ట్‌లో చేయితిరిగిన కళాకారులు ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ కొద్ది మంది కళాకారుల సరసన తానూ నిలవాలని తపించాడో వ్యక్తి. లక్ష్యం దిశగా అడుగులేసే క్రమంలో చిత్రకళాప్రపంచంలో అతిరథ మహారథులను కలిశాడు. పెయింటింగ్‌లో మెళకువలను అవపోసన పట్టాడు. తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. హైపర్‌ రియలిస్టిక్‌ ‘బ్రహ్మ’గా పేరు సంపాదించిన  కళాకారుడు యేలూరి శేషబ్రహ్మం విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ఒంగోలు అర్బన్‌: ప్రకాశం జిల్లా కవులకు, కళాకారులకు పట్టుకొమ్మ అని అనేక సందర్భాల్లో నిరూపితమవుతూనే ఉంది. మన జిల్లాకు రెండు వేల సంవత్సరాల కళావారసత్వం ఉంది. బౌద్ధులు, ఇక్ష్వాకులు, చాళుక్యుల కాలం నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు ఈ గడ్డ అబ్బురపడే కళాకారులని ప్రపంచానికి అందిస్తూనే ఉంది. ఈ నేల అస్తిత్వం కలిగిన ఈ తరం చిత్రకారుడు యేలూరి శేషబ్రహ్మం. చిత్రకళా ప్రపంచంలో బ్రహ్మగా పిలువబడే శేషబ్రహ్మం 1976లో వెంకటసుబ్బారావు, వరలక్ష్మి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. వీరి పూర్వీకుల నుంచి కళాకారుల నేపథ్యం ఉండటంతో బ్రహ్మం చిన్నతనం నుంచే చిత్రకళపై అమితాసక్తి చూపుతూ అదే రంగంలో రాటుదేలాడు.

చిన్న వయసులో చిత్రలేఖనం సాధన ప్రారంభించి ఒంగోలులో కొంతకాలం డ్రాయింగ్‌ మాస్టర్‌ రామకృష్ణ, సూర్య ఆర్ట్స్‌ జె.వెంకటేశ్వర్లు వద్ద శిష్యరికం చేశాడు. పదో తరగతి వరకు ఒంగోలులో విద్యనభ్యసించిన బ్రహ్మం.. చిత్రకళనే జీవితంగా మలుచుకోవాలని భావించాడు. ఒంగోలుకు చెందిన ఆధునిక చిత్రకారుడు డాక్టర్‌ మాచిరాజు రామచంద్రరావు సలహా మేరకు హైదరబాద్‌లోని జేఎన్‌టీయూలో సీటు సాధించి బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ) పూర్తి చేశాడు. యూనివర్శిటీలో బీఎఫ్‌ఏ చేసే రోజుల్లో బ్రహ్మం ఆసక్తిని గమనించిన గురువులు, సీనియర్లు చిత్రలేఖనం, పెయింటింగ్‌తోపాటు పలు అంశాల్లో మెళకువలు నేర్పారు. వాటిని అందిపుచ్చుకున్న బ్రహ్మం తనకంటూ ఒక శైలిని ఎంచుకోవడంలో అడుగు ముందుకు వేశాడు. అబ్బురపరిచే చిత్రాలను వేసి ఔరా అనిపించాడు. యూనివర్శిటీలో తరగతులు ముగియగానే ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం, చిత్రకారులు, శిల్పకారులు, ఫోటోగ్రాఫర్ల జీవితాలను, కళలను అధ్యయనం చేసేవాడు.  పెన్సిల్, క్రేయాన్స్, ఆయిల్‌ కలర్స్, వాటర్‌ కలర్స్‌ ఇలా అన్ని రకాల మీడియంలలో చిత్రాలను సాధన చేసి వందలాది చిత్రాలను మలిచాడు.

హైపర్‌ రియలిజం వైపు అడుగులు
 బ్రహ్మం ప్రపంచంలోనే అతి తక్కువ మంది చెయ్యగలిగే శైలి అయినటువంటి ‘హైపర్‌ రియలిజం’ శైలిని ఎంచుకుని అనేక చిత్రాలను గీశాడు. రాష్ట్రీ, జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్స్‌ అందుకోవడమే కాకుండా ఒక సందర్భంలో ప్రపంచ ప్రఖ్యాత పాప్‌ సింగర్‌ మైఖేల్‌ జాక్సన్‌ నుంచి ప్రశంస పత్రం అందుకున్నాడు. కాలేజీ విద్య అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా తన కళా సాధనను ఇంకా వృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. పదేళ్లపాటు దేశంలోని అనేక చారిత్రక, గ్రామీణ, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు తిరుగుతూ ప్రకృతిలోని రంగుల మేళవింపును ఆకళింపు చేసుకున్నాడు. ఒక కళాకారునికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధం కొన్ని వందల పెయింటింగ్‌లు వేసేందుకు పురిగొల్పింది. తాను కళా సాధన చేస్తూనే వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు వారంతా చిత్రకళా రంగంలో స్థిరపడి ఉండటం విశేషం.

శిల్పకళలోనూ ప్రావీణ్యం
కేవలం చిత్రకళలోనే కాకుండా శిల్పకళలోనూ తర్ఫీదు పొంది మోల్డింగ్‌ క్లే, ఫైబర్, గ్రానైట్‌ స్టోన్‌పై శిల్పాలు మలచడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం పొందారు. శిల్పకళా ప్రావీణ్యం గమనించిన హైదరబాద్‌లోని జనహర్ష కంపెనీ నిర్మించ తలపెట్టిన వందకోట్ల ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్‌ ఇన్‌చార్జిగా బ్రహ్మాన్ని నియమించారు. జనహర్ష చేపట్టిన ప్రాజెక్టులోని రిసార్టుల్లో కళాకౌశలం దేశంలో అత్యంత అందమైనదిగా రూపుదిద్దుకుంటోంది. గుళ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లో స్వయంగా కంపెనీ ప్రారంభించి అందమైన శిల్పాలు తయారు చేస్తున్నారు. తన స్నేహితులు బాలసుబ్రహ్మణ్యం, చిన్నమస్తాన్‌తో కలిసి స్వయంగా కటింగ్‌ మిషన్‌ తయారు చేసుకోవడం విశేషం. కళలతో పాటు సామాజిక బాధ్యతను మరువకుండా గతంలో ఒంగోలులో ‘ఒపాక్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భూగోళాన్ని కభళిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలపై యుద్ధం ప్రకటించారు. నో ప్లాస్టిక్‌ నినాదంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సామాజిక బాధ్యతను గుర్తుచేశారు.

తిరుమల సన్నిధిలో వెంకన్న నేత్రదర్శనం పెయింటింగ్‌
తిరుమల వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం పెయింటింగ్‌ వేసేందుకు దేశంలో పేరుగాంచిన చిత్రకారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. బ్రహ్మంలోని రియలిస్టిక్‌ ఆర్టిస్ట్‌ను గుర్తించి ఎంపిక చేశారు. నాలుగు గురువారాలు స్వామివారి సన్నిధిలో గడిపి వేంకటేశ్వరుని నేత్రదర్శనం పెయింటింగ్‌ వేశారు బ్రహ్మం. ఆ పెయింటింగ్‌ ఎంతో ప్రాచుర్యం పొంది ఇప్పుడు వాడవాడలా దర్శనమిస్తోంది. ఇప్పటికీ ఆ ఒరిజినల్‌ పెయింటింగ్‌ పద్మావతి అమ్మవారి దేవస్థానంలో గర్భగుడి ఎదురుగా అలకరించి ఉంది. ఆ పెయింటింగ్‌ వేసే సమయానికి బ్రహ్మం వయసు కేవలం 21 సంవత్సరాలు.

విస్తరించిన కళ
బ్రహ్మం నెమ్మదిగా తన కళను అనేక రంగాలకు విస్తరించాడు. ఇంటీరీయర్, ఎక్స్‌టీరియర్, డిజైనింగ్, ఫ్యాబ్రిక్‌ డిజైనింగ్, డిజిటల్‌ పెయింటింగ్స్, మెషిన్‌ మేకింగ్‌ ఇలా పలు రకాలుగా ప్రయోగాలు చేస్తూ.. విజయం సాధిస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాల కవర్‌ పేజీలు బ్రహ్మం కుంచె నుంచి జాలువారినవే. నాన్నకు ప్రేమతో, భాగమతి, మహానుభావుడు, లై తదితర చలనచిత్రాల్లో తను వేసిన పెయింటింగ్‌లు ప్రముఖంగా కనిపిస్తాయి. ముంబయిలోని పలు ఫైన్‌ఆర్ట్స్‌ కాలేజీల్లో బ్రహ్మం చిత్రాల డెమోనిస్ట్రేషన్‌ జరిగిందంటే ఆయన ప్రతిభ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నిమిషాల వ్యవధిలో ఎంఎఫ్‌ హుస్సేన్‌ చిత్రం
చదువుకునే రోజుల్లో ఒకసారి ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ హైదరాబాద్‌ రావడంతో ఆయనను కలిశాడు. ఆయనతో మాట్లాడుతూ కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే చార్కోల్‌తో ఎంఎఫ్‌ హుస్సేన్‌ స్కెచ్‌ వేసి ఆశీస్సులు పొందాడు. ప్రఖ్యాత వ్యంగ్య చిత్రకారుడు మోహన్‌.. బ్రహ్మం గీసిన చిత్రాలను మెచ్చుకుని ఆయన వద్దే కొంత కాలం ఉంచుకుని రొమాంటిసిజం, ఇంప్రెషనిజం, క్యూబిజం, మోడరన్‌ ఆర్ట్స్‌ తదితర చిత్రకళా రీతులను, జపనీస్, చైనీస్‌ వాటర్‌ కలర్, ఇండియన్‌ మినీయేచర్‌ చిత్రాల గొప్పదనాన్ని వివరించి శిక్షణ ఇచ్చారు.

శ్రీమతి సహకారం.. స్నేహ బంధం
బ్రమ్మం శ్రీమతి వాణి కూడా కళాకారిణి కావడంతో తన సాధనకు చేయూత లభించిందని ఆయన చెబుతుంటారు. అంతేకాకుండా కాలేజీ రోజుల నుంచి తన సహ విద్యార్థి అయిన ప్రముఖ చిత్రకారుడు ఆంజనేయులు, బ్రహ్మంది విడదీయరాని స్నేహబంధం. ఎవరి సాధన వారు చేస్తున్నా ఒకే రూమ్‌లో ఉండటం, వివాహాలైన తర్వాత కూడా ఒకే నివాసంలో పక్కపకనే ఉండటంతోపాటు ఒకే స్టూడియోలో ఇప్పటికీ పెయింటింగ్‌ వేసుకుంటూ స్నేహానికి నిర్వచనంగా నిలుస్తున్నారు.

టార్గెట్‌ 2020
రెండేళ్ల క్రితం ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ జగదీశ్‌ మిట్టల్‌ బ్రహ్మం డ్రాయింగ్‌ కొనుగోలు చేసి తన నివాసంలోని హాల్లో అలంకరించుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మం దృష్టి 2020లో ఢిల్లీలో నిర్వహించనున్న పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌పైనే ఉంది. పదహారు కళాకండాలతో పద్రర్శించబోయే ఈ సోలో ప్రదర్శనలో శేషబ్రహ్మం విజేతగా నిలవాలని ఆశిద్దాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top