జీజీహెచ్‌లో గుండె మార్పిడి విజయవంతం

Heart Transplantation Success in GGH Guntur - Sakshi

విలేకరుల సమావేశంలో డాక్టర్‌ గోఖలే వెల్లడి

తొమ్మిది గంటల సేపు జరిగిన ఆపరేషన్‌  

జీజీహెచ్‌కు అరుదైన ఘనత

గుంటూరు జీజీహెచ్‌లో శుక్రవారం గుండె మార్పిడి ఆపరేషన్‌ విజయవంతం చేశారు. కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో వైద్యులు నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువకుడి గుండెను.. ఆగిపోతున్న మరో యువకుడి ప్రాణానికి అడ్డు పెట్టి.. అతని గొంతులో అమృతం పోశారు. లబ్‌ డబ్‌ అంటూ కొట్టుకుంటున్న ఆ గుండెలో ఆ వైద్యులు ఆరాధ్యులై నిలిచారు. 

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శుక్రవారం చేసిన గుండె మార్పిడి ఆపరేషన్‌ విజయవంతమైనట్లు సహృదయ ట్రస్ట్‌ నిర్వాహకులు, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే చెప్పారు. శుక్రవారం రాత్రి జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొండాపురానికి చెందిన  27 ఏళ్ల చిమ్మిలి హరిబాబులు మూడేళ్లుగా ఇస్కిమిక్‌ కార్డియో మయోపతి(గుండె జబ్బుతో) వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి గుండెమార్పిడి ఆపరేషన్‌ చేస్తేనే బతికే అవకాశం ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించి, జీవన్‌ధాన్‌లో పేరు నమోదు చేయించారు. కృష్ణాజిల్లా  నందిగామకు చెందిన పిన్నెల్లి జగదీష్‌ (22)కు గురువారం బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించిన మణిపాల్‌ ఆస్పత్రి వైద్యులు గుంటూరు వైద్యులకు సమాచారం ఇచ్చారు.

ఈ నెల 1వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో జగదీష్‌ తీవ్రంగా గాయపడి మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మణిపాల్‌ హాస్పటల్‌కు డాక్టర్‌ గోఖలే వైద్య బృందం వెళ్లి గుండెను సేకరించి గుంటూరు జీజీహెచ్‌కు మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకువచ్చారు. తనతో పాటుగా మత్తు వైద్యనిపుణులు డాక్టర్‌ కోనేరు సుధాకర్, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, సర్జన్‌లు డాక్టర్‌ రమణ, డాక్టర్‌ మోతీలాల్, డాక్టర్‌ మనోజ్‌లు సుమారు 9 గంటల సేపు జరిగిన గుండె మార్పిడి ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. సాయంత్రం 6.30 గంటలకు ఆపరేషన్‌ ముగిసిందని, గుండె ఫిట్‌ అయ్యిందని, రక్తసరఫరా బాగుందన్నారు.  ప్రస్తుతం హరిబాబులును వెంటిలేటర్‌పై ఉంచామని, శనివారం వెంటిలేటర్‌ తీసివేస్తామన్నారు. హరిబాబులుకు ఆపరేషన్‌ చేసేందుకు గుండె దొరకక చనిపోతాడని పది రోజుల కిందట భావించామన్నారు. గుండె దానం చేసిన జగదీష్‌ రక్తం బి–పాజిటివ్‌ అని, హరిబాబులు ఎబి–పాజిటివ్‌ గ్రూప్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. జగదీష్‌ కళ్ళు,  లివర్, కిడ్నీలను కూడా సేకరించామన్నారు. గ్రీన్‌కారిడార్‌ ద్వారా గుండెను మణిపాల్‌ ఆస్పత్రి నుంచి సకాలంలో తీసుకొచ్చేందుకు పోలీస్‌ సిబ్బంది ఎంతో సహకరించారని తెలిపారు.

చరిత్ర సృష్టించిన జీజీహెచ్‌..
ఎయిమ్స్‌ లాంటి కేంద్ర సంస్థల్లో మినహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లు జరగలేదని, కేవలం గుంటూరు జీజీహెచ్‌లోనే తాము చేశామని డాక్టర్‌ గోఖలే చెప్పారు. ఈ ఆపరేషన్‌తో దేశంలోనే గుండె మార్పిడి ఆపరేషన్లు అధికంగా చేసిన ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్‌ చరిత్ర సృష్టించిందన్నారు. జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారు చాలా మంది ఉన్నారని, అవయవదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డీఎస్‌ రాజునాయుడు మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి 13 వరకు వరల్డ్‌ ఆర్గాన్‌డే సందర్భంగా అవయవదానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వరల్డ్‌ హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ డే రోజునే తమ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్‌ విజయవంతం అవ్వటం చాలా గర్వంగా ఉందన్నారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను, మత్తు వైద్య నిపుణులు డాక్టర్‌ కోనేరు సుధాకర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ వడ్లమూడి శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మోతీలాల్, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top