ప్రభుత్వ ఆదాయానికి ‘చెక్’పోస్ట్ | Government income 'check' post | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆదాయానికి ‘చెక్’పోస్ట్

Aug 23 2013 4:23 AM | Updated on Oct 20 2018 6:04 PM

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్ర అధికారులు, సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెకు దిగడంతో చెక్‌పోస్టు మూతపడింది.

 సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్ర అధికారులు, సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెకు దిగడంతో చెక్‌పోస్టు మూతపడింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
 
 ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు పండగ చేసుకుంటున్నారు. పన్నుల ఎగవేతదారుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెక్‌పోస్టులో రవాణా, వాణిజ్యపన్నులు, గనులు భూగర్భ, అటవీ, పశుసంవర్థక, మార్కెటింగ్, ఎక్సైజ్ అండ్ పోలీస్ అనే ఏడు శాఖలున్నాయి. వీటిలో అత్యధికంగా రవాణా, వాణిజ్యపన్ను శాఖలకు అధిక రాబడి ఉంటుంది. మిగిలిన వాటిలో వచ్చిన కాడికి దండుకోవడమే పని. తమిళనాడు, ఆంధ్రా నుంచి వాహనాల్లో అనేక రకాల వస్తువులు రవాణా అవుతుంటాయి. ఇందులో కొన్నింటికి పన్నులు చెల్లించాల్సిన వాహనాలపై కేసులు రాస్తే గూడూరు వాణిజ్యపన్నుల కార్యాలయంలో పన్నులు చెల్లిస్తారు. చెక్‌పోస్టులోని వాణిజ్యపన్నుల శాఖలో యూజర్ చార్జీల కింద ప్రతి లారీ నుంచి రూ.50 వసూలు చేస్తారు. ఈ విధంగా రోజుకు సుమారుగా రెండు వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
 
 యూజర్ చార్జీలు కింద రోజుకు రూ.10 వేల నుంచి రూ.25 వేలదాకా వస్తుంది. అదే విధంగా రవాణాశాఖ వారు వాహనాల పర్మిట్లు, అధికలోడుతో వెళ్లే వాటికి పన్నులు విధిస్తారు. ఈ విధంగా రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు దాకా ప్రభుత్వ రాబడి వస్తోంది. పది రోజుల నుంచి రవాణాశాఖాధికారి, వాణిజ్యపన్నుల శాఖాధికారులు సమ్మె పాటిస్తుండడంతో చెక్‌పోస్టు నుంచి రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు దాకా ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. రవాణా శాఖాధికారులు పెన్‌డౌన్ చేసి కేసులు రాయడం మానేశారు. దీంతో వాహనాలు యథేచ్ఛగా వెళుతున్నాయి. మిగిలిన శాఖల్లో ఎమర్జెన్సీ సిబ్బంది ద్వారా విధులు నిర్వహించినా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రధానంగా సరిహద్దు చెక్‌పోస్టుల నుంచే ఆదాయం వస్తుంది. గత పదిరోజులుగా తీసుకుంటే సరాసరి ఇప్పటికి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ప్రభుత్వాదాయానికి గండి పడిందని పలుశాఖల అధికారులు చెబుతున్నారు.
 
 అక్రమార్కులు ప్రవేశం
 సమైక్యాంధ్ర సమ్మెతో ప్రయివేట్ వ్యక్తులు, పోలీసులు వసూళ్లు చేస్తున్నారు. వాహనచోదకులు కూడా ఇదే అదునుగా భావించి పన్నులు చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. బియ్యం, ధాన్యం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కిరాణా వస్తువులు రవాణా చేసే పార్శిల్ , ఇసుక, గ్రానైట్ లారీలు ఎలాంటి పన్నులు చెల్లించకుండా దర్జాగా వెళ్లిపోతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement