ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయండి 

Give to  Perform special status form ap : ysrcp MP Vijayasai Reddy - Sakshi

అఖిలపక్ష భేటీలో ప్రధానికి  ఎంపీ విజయసాయిరెడ్డి వినతి  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయడం ద్వారా పార్లమెంటులో నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చి పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రధానంగా ఐదంశాలు లేవనెత్తినట్టు తెలిపారు. ‘‘పార్టీలు అధికారంలోకి రావొచ్చు.. పోవచ్చు. కానీ ప్రభుత్వమనేది నిరంతర ప్రక్రియ. 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

తదుపరి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోనిపక్షంలో అది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమవుతుందని సమావేశంలో వివరించాం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచి ఇంకా అమలు చేయని అంశాలు చాలా ఉన్నాయి. విశాఖ రైల్వేజోన్, చెన్నై–వైజాగ్‌ కారిడార్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌ తదితర ఆచరణకు నోచుకోని హామీలన్నింటినీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం’’అని విజయసాయిరెడ్డి వివరించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు తెలుపుతోందని చెప్పామన్నారు.  ఇదిలా ఉండగా, కేంద్ర బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top