
పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే: గంటా
ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఎమ్మెల్సీ టికెట్లను పార్టీ అధిష్టానం సీనియర్లకే కేటాయించిందని ఆయన అన్నారు. కన్నబాబు రాజుకు పార్టీ పట్ల అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని.. ఆయన పోటీ చేయటంపై మరోసారి పునరాలోచించుకుంటే మంచిదని కోరినట్టు గంటా ఈ సందర్భంగా తెలిపారు.
కన్నబాబు రాజు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. పోటీ అనివార్యమైతే భారీ మెజారిటీతో గెలుస్తామని గంటా పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవటంతో కన్నబాబు రాజు... రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.