యరపతినేని సహా ఆయన  అనుచరుల గుండెల్లో రైళ్లు

Former MLA Yarapathinenis Illegal Mining Case To CBI Soon - Sakshi

త్వరలో సీబీఐకి అక్రమ మైనింగ్‌ కేసు 

ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో సున్నపురాయి దోపిడీ

రూ. కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొట్టిన వైనం 

హైకోర్టు ఆదేశాలతో గతేడాది సీబీసీఐడీ విచారణ 

విచారణను పక్కదారి పట్టించిన టీడీపీ ప్రభుత్వం

తాజాగా సీబీఐ చేతికి వెళ్లనున్న కేసు  

ఆందోళనలో యరపతినేని, ఆయన అనుచరగణం

పల్నాడు ప్రాంతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పులిచింతల, ఎత్తిపోతల వంటి నీటి ప్రాజెక్టుల రాకతో పచ్చని పంటల సాక్షిగా రైతుల నవ్వులు  కళ్ల ముందు కదలాడతాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు తెరదీశారు. వందల కోట్ల రూపాయల సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు. అడిగిన వారిని పోలీసులతో కుళ్లబొడిపించారు. అప్పటి ప్రభుత్వ అండతో అవినీతి కేసుల నుంచి తప్పించుకున్నారు. 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడంతో యరపతినేని పాపం పండింది. అక్రమ మైనింగ్‌ భరతం పట్టేందుకు న్యాయస్థానాల అనుమతి తీసుకుంది. ఇప్పటి వరకు సీబీసీఐడీ ఆధ్వర్యంలో సాగిన విచారణ మరో వారంలో సీబీఐ చేతుల్లోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన యరపతినేనిసహా ఆయన  అనుచరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో పల్నాడు ప్రాంతంలో మైనింగ్‌ మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గురజాల నియోజకవర్గంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్నారు. వందల కోట్ల రూపాయలను దండుకున్నారు. మైనింగ్‌ మాఫియాలో ప్రధాన నిందితుడుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతోపాటుగా మరి కొందరిని బాధ్యులుగా చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. టీడీపీ అండదండలతో యరపతినేని అప్పట్లో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో హైకోర్టు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో సీబీఐ అధికారులు అక్రమ మైనింగ్‌ కేసులకు సంబంధించిన దర్యాప్తు నివేదికలను సీఐడీ అధికారుల నుంచి స్వాధీనం చేసుకోనున్నారు. 

వెలుగు చూసిందిలా..
గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్‌ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ నాయకులు న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదిలో అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే అప్పట్లో అధికార పార్టీ ఆదేశాలతో మైనింగ్‌ మాఫియాకు పాల్పడిన వారిని సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టలేదు. అనంతరం వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశంతో విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై 17 కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ట్రాక్టర్‌ డ్రైవర్లు, కూలీలు, మిల్లర్లు, ఇతర వ్యక్తులను సీఐడీ అధికారులు విచారించారు. సుమారు 700 మందిని విచారించి వారి నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. ఆయా కేసుల్లో కీలకమైన సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచి సెక్షన్‌ 164 ప్రకారం మొత్తం 24 మంది నుంచి స్టేట్‌మెంట్‌లు తీసుకున్నారు. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో హైకోర్టు పరిధిలో ఉన్న కేసులను సీఐడీ అధికారులు ఉపసంహరించుకున్నారు.

రోజుల వ్యవధిలో...
నెల రోజుల క్రితం సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అనంతరం సీఐడీ అధికారులు అయా కేసుల వారీగా వారు జరిపిన దర్యాప్తు పత్రాలను సిద్ధం చేశారు. ఎప్పుడు సీఐడీ అధికారులు వచ్చినా అన్ని పత్రాలను అందచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారం రోజుల్లో సీఐడీ అధికారులు వచ్చి కేసుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 

అక్రమార్కుల గుండెల్లో వణుకు
కేసు సీఐడీ అధికారులకు వెళుతున్న విషయం తెలుసుకున్నప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపాటు అక్రమ మైనింగ్‌లో భాగస్వాములైన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ హయాంలో బినామీల పేరిట దాచుకున్న సొత్తునంతా కక్కిస్తారని భయపడుతున్నారు. ఎప్పుడు తమను విచారణకు పిలుస్తారోనని వణికిపోతున్నారు. అక్రమ మైనింగ్‌ ద్వారా సంపాదించిన వందల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్‌కు వెళతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top