జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరుసగా రెండో సారి జనరల్ కేటగిరిలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నిలకు సకాలంలో పూర్తిచేయకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను ప్రకటించింది.
సాక్షి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరుసగా రెండో సారి జనరల్ కేటగిరిలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నిలకు సకాలంలో పూర్తిచేయకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను ప్రకటించింది. రేపు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది. ఈ క్రమంలో జెడ్పీ చైర్మన్ పీఠం జనరల్ కేటగిరిలోకి రావడంతో దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. చైర్మన్ పదవిని పలువురు ఆశించే అవకాశం ఉండడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తూ, అవకాశం దక్కే పరిస్థితి లేని వారు ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పదవికి తీవ్ర పోటీ ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో 46 జెడ్పీటీసీలు ఉన్నాయి. చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా 24 స్థానాలను కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు మధ్యలో జరగనున్న జెడ్పీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మరోవైపు మెజారిటీ ఎంపీటీసీలను దక్కించుకుని మండల పరిషత్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికకు కసరత్తు మొదలు పెట్టాయి.
ఇప్పటి వరకు 12 మంది
జెడ్పీ చైర్మన్లు
నెల్లూరు జిల్లా పరిషత్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు జెడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో చెంచురామనాయుడు,(1959), నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి(1962), గోపాలకృష్ణారెడ్డి(1970), వెంకటసుబ్బయ్య(1981), డాక్టర్ బాలచెన్నయ్య(1983), ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి(ఇన్‌చార్జి,1985), డేగా నరసింహారెడ్డి(1987), నాగభూషణమ్మ(1995), ఎంవీ రాఘవరెడ్డి(ఇన్‌చార్జి, 1995), ఎన్ కౌసల్య మ్మ (1998-2000), చెంచలబాబూయాదవ్(2001), కాకాణి గోవర్ధన్‌రెడ్డి (2006) ఉన్నారు. మధ్యలో అప్పుడప్పుడూ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.