నీటి విడుదల ప్రకటనతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
హాలియా, న్యూస్‌లైన్: నీటి విడుదల ప్రకటనతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వల నుంచి రబీ సాగుకు నీటిని వదిలేందుకు రాష్ట్ర భారీ, నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిన్నమొన్నటి దాకా నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.
నిండా ముంచిన ఖరీఫ్
ఈ ఖరీఫ్ ఆయకట్టు రైతులను నిండా ముంచింది. ఓవైపు వరుస తుపాన్లు, మరోవైపు దోమకాటుతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 20 నుంచి 30 బస్తాల లోపే ధాన్యం దిగుబడి వచ్చింది. రైతులకు పెట్టుబడి కూడా వెళ్లలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వ కింద 4,31,300 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ మిగిల్చిన అప్పును తీర్చేందుకు సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు వరిసాగుకు సమాయత్తమవుతున్నారు.
4.31 లక్షల ఎకరాలకే సాగునీరు ...
సాగర్ ఎడమ కాల్వ కింద 10.33 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. అందులో నల్లగొండ జిల్లాలో 3,80,000, ఖమ్మం జిల్లా పరిధిలోని 2,77,000, కృష్ణాజిల్లాలో 3,75,000 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ రబీలో ప్రభుత్వం మాత్రం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 4,31,000ఎకరాలకే సాగునీరు ఇచ్చేందుకు నిర్ణయించింది.
150 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం : సీఈ ఎల్లారెడ్డి
ఈ ఏడాది రబీలో వరి సాగుకు కుడి, ఎడమ కాల్వలతో పాటు డెల్టాకు 50 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేసేందుకు వీలున్నట్లు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నాగార్జునసాగర్ జలాశయంలో నీరుండడంతో పాటు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రబీలో వరిసాగుకు నీటి విడుదలకు నిర్ణయం తీసుకుంది.