అష్టకష్టాలు పడుతున్నాం.. మాకేదీ ‘ఫిట్‌మెంట్’! | Farmers demand hike in minimum support prices | Sakshi
Sakshi News home page

అష్టకష్టాలు పడుతున్నాం.. మాకేదీ ‘ఫిట్‌మెంట్’!

May 15 2015 2:15 AM | Updated on Jun 4 2019 5:04 PM

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నా ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా అంతే ఫిట్‌మెంట్ ఇచ్చారు.

రాజమండ్రి : ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నా ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా అంతే ఫిట్‌మెంట్ ఇచ్చారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించినా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలపై మాకు ‘ఫిట్‌మెంట్’ (బోనస్) ఎందుకు ఇవ్వరు?’అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీస మద్దతు ధర పెంచకపోవడం, ఉన్న మద్దతు ధరకన్నా తగ్గించి మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
 
  ప్రభుత్వోద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన ఫిట్‌మెంట్ ఇచ్చినట్టే తమ పంటలకు సైతం లాభసాటి ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది రబీలో సుమారు 15 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే కోతల సమయంలో వర్షాలు పడడం, యంత్రాలతో కోయించడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోలేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.  ఇదే అదనుగా వారు బస్తా (75 కేజీలు) రూ.1,050 ఉండగా, కేవలం రూ.850కు కొంటున్నారు. దీని వల్ల పంట పండినా నష్టపోవాల్సి రావడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. తాను అధికారంలోకి వస్తే రైతులకు లాభసాటి ధర కల్పిస్తానన్న బాబు ఇప్పుడు నోరు మెదపడం లేదు.
 
  కేంద్రం లాభసాటి మద్దతు ధర ప్రకటించకున్నా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి బోనస్ ప్రకటించే అవకాశముంది. ఈ విషయాన్ని కూడా బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పుడున్న మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయించేందుకు తీసుకున్న చర్యలు కూడా లేవు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ మించకూడదన్న నిబంధననూ సడలించ లేదు. దీని వల్ల రైతులు ధాన్యాన్ని బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటీవల కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) వరికి రూ.50 మద్దతు ధర పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినా ఇప్పటి వరకు అనుమతి రాలేదు. కనీసం ఈ పెంపును అమలు చేసినా ఎంతోకొంత మేలనుకుంటుంటే రైతులు వారివద్దనున్న ధాన్యాన్ని అరుునకాడికి అమ్ముకున్నాక తప్ప కేంద్రం అనుమతి ఇచ్చేలా లేదు.
 
 అప్పటి నష్టానికి పరిహారాలు ఇంకెప్పటికో?
 ముఖ్యంగా పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) ఊసే లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటికీ 20 శాతం మంది రైతులకు నీలం పరిహారం అందలేదు. సుమారు రూ.110 కోట్ల హెలెన్ తుపాను పరిహారం ఊసేలేదు. రుణమాఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జిల్లాలో ఇంకా 30 శాతం మంది రైతులు కాకినాడలోని రుణమాఫీ దరఖాస్తులు స్వీకరించే కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న తమకు సైతం ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇచ్చిన తరహాలో మద్దతు ధర పెంచి, ఇతర రాయితీలు కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement