సొమ్ము ప్రభుత్వానిది.. సోకు టీడీపీది | Sakshi
Sakshi News home page

సొమ్ము ప్రభుత్వానిది.. సోకు టీడీపీది

Published Thu, Dec 11 2014 2:55 AM

సొమ్ము ప్రభుత్వానిది.. సోకు టీడీపీది - Sakshi

ఇదీ రైతు సాధికారత సదస్సుల ముఖ్య ఉద్దేశం
ముందుగా గ్రామాల్లో మేళతాళాలతో ప్రదర్శనలు
సదస్సులో రుణమాఫీ పత్రాల అందజేత
రుణం మాఫీ కాని రైతులను బుజ్జగించే పని అధికారులదేనంట!
ఊరూరా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు
హడలెత్తుతున్న అధికార యంత్రాంగం

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు సాధికారత సదస్సులు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అధికార పార్టీ భారీ ప్రణాళిక, పక్కా వ్యూహంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రధానంగా రుణమాఫీపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతుల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

గ్రామగ్రామాన ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతలతో మేళతాళాలు, మిఠాయిల పంపిణీ వంటి హంగామ చేయించనుంది. ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ సొంత ప్రచారం చేసుకుంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే... రుణమాఫీ విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రైతు సాధికారత సదస్సులు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

రుణమాఫీకి సంబంధించి ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా అధిగమించాలనే దానిపై నిర్ధిష్టమైన ప్రణాళికనూ ప్రభుత్వమే రూపొందించింది. ఇందులో భాగంగా బుధవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మూడు గంటల పాటు జరిగిన కాన్ఫరెన్స్‌లో సదస్సుల్లో అధికారులు నిర్వహించాల్సిన ముందస్తు వ్యూహాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి దేవినేని ఉమా నాయకత్వం వహించడం గమనార్హం. రుణ ఉపసంహరణ పత్రాలు, పింఛన్ల పంపిణీ, ఇసుక, ధాన్యం కొనుగోళ్లు వంటి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు.
 
పోలీసు బందోబస్తు
ఈ సదస్సులకు పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత స్టేషన్ల వారీగా గ్రామసభలు జరిగే ప్రాంతాల్లో బందోబస్తు పర్యవేక్షించాలని ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది, ప్రతి మండలంలో అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి రోజూ రెండు లేదా మూడు గ్రామాల్లో సదస్సులు నిర్వ హించాలి.
సదస్సులకు సంబంధించి కరపత్రాలు వాల్‌పోస్టర్లు పంపిణీ చేయాలి.
సదస్సు జరిగే ముందురోజు గ్రామంలో మైకుల ద్వారా ప్రచారం చేయాలి.
అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలి.
రుణం మాఫీ అయిన వారికి పత్రాలు అందించాలి.
రుణం రద్దు కాని వారు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సరైన రీతిలో సమాధానం చెప్పాలి.
మరో నెల రోజుల్లో అందరికీ రుణం మాఫీ అవుతుందని రైతులకు నచ్చచెప్పాలి.
ముందుగా బ్యాంకర్లతో మండల అధికారులతో సమావేశాలు నిర్వహించాలి.
రుణమాఫీ రెండో జాబితా ఉంటుందని చెప్పాలి.
మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా పాల్గొనాలి.
పింఛన్ల పంపిణీపై, ఇసుక సరఫరా, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.  
 
సదస్సులను జయప్రదం చేయాలి : మంత్రి ఉమా
విజయవాడ : రైతు సాధికారత సదస్సులను జయప్రదం చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అధికారులతో మాట్లాడి సూచనలిచ్చారు. అన్ని శాఖల అధికారులు గ్రామాల్లోకెళ్లి పెద్ద ఎత్తున సదస్సులను జయప్రదం చేయాలన్నారు. కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని చెప్పారు. జేసీ మురళీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement