రాజధాని శాశ్వత భవనాల వ్యయం రెట్టింపు 

Expenditure became double for permanent buildings of Capital Amaravati - Sakshi

తొలుత 30 లక్షల చదరపు అడుగులకు వ్యయం 

రూ.1,200 కోట్లు ఇప్పుడు 69 లక్షల చ.అ.కు పెరిగిన శాశ్వత భవనాలు  

మూడు ప్యాకేజీల కింద రూ.2,274.77 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం   

ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీకి అప్పగింత.. తాత్కాలిక  సచివాలయం కట్టిన సంస్థలకే   

అదనంగా మౌలిక వసతుల కల్పన పేరుతో మరో రూ.1,060 కోట్లు  

సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం తరహాలోనే రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణ వ్యయం కూడా భారీ స్థాయికి చేరుకుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో ఇప్పటికే భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్‌ నివేదికలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్పష్టం చేయడం తెలిసిందే. ఈ పనులను టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎక్సెస్‌తో కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆడిట్‌ నివేదికలో పేర్కొంది. చిన్నపాటి వాన కురిస్తేనే తాత్కాలిక సచివాలయంలోని కార్యాలయాల్లోకి వర్షం నీరు వచ్చేలా నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలకే శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలభవనాల నిర్మాణ టెండర్లను సర్కారు అప్పగించడం గమనార్హం. శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ఐదు టవర్లలో 30 లక్షల చదరపు అడుగుల్లో రూ.1,200 కోట్లతో నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అయితే టెండర్ల దగ్గరకు వచ్చే సరికి ఇది 69 లక్షల చదరపు అడుగులకు పెరిగిపోయింది.

ఐదు టవర్లలో నిర్మాణం చేపట్టేందుకు మూడు ప్యాకేజీలుగా విభజిస్తూ టెండర్లను ఆహ్వానించారు. తొలి ప్యాకేజీ కింద ఐదో టవర్‌లో సాధారణ పరిపాలనశాఖ భవనాల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్‌ను రూ.592.41 కోట్లతో ఎన్‌సీసీ సంస్థకు అప్పగించారు. రెండో ప్యాకేజీలో మూడు, నాలుగు టవర్ల పనులను రూ.749.90 కోట్లతో ఎల్‌ అండ్‌ టీకి అప్పగించారు. ఒకటి, రెండో టవర్లకు మూడో ప్యాకేజీ కింద టెండర్లను ఆహ్వానించి రూ.932.46 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీకి అప్పగించారు. మొత్తం ఐదు టవర్లలో శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల నిర్మాణ వ్యయాన్ని రూ.2,274.77 కోట్లుగా పేర్కొన్నారు. తొలుత 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను చేపట్టాలని భావించి తరువాత 69 లక్షల చదరపు అడుగులకు ఎందుకు పెంచారో అర్థం కావడం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.  విభిన్న సదుపాయాల పేరుతో ఇంటిగ్రేటెడ్‌ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారని, ఇందులోనే అన్ని రకాల వసతుల కల్పనకు ఆస్కారం ఉన్నప్పటికీ కొత్తగా ఐదు టవర్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,060 కోట్ల అంచనాతో మరో టెండర్‌ను ఆహ్వానించారని ఆ ఉన్నతాధికారి తెలిపారు. పేరుకు మాత్రమే టెండర్లను ఆహ్వానించి ఎవరూ ముందుకు రాలేదంటూ రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన ఆ పనులను కూడా ఐదు టవర్లు నిర్మించే సంస్థలకే పందేరం చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.  

రెట్టింపు దాటిన కన్సల్టెంట్‌ ఫీజు  
ఐదు టవర్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ కోసం తొలుత 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.1,200 కోట్ల అంచనాతో టెండర్‌ను ఆహ్వానించగా ప్రాజెక్టు వ్యయంలో 0.89 శాతం ఇచ్చేందుకు సీఆర్‌డీఏ ‘ఈజీఐఎస్‌’ను ఎంపిక చేసింది. తొలుత అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం ప్రకారం ఈజీఎస్‌ కన్సల్టెంట్‌కు రూ.10.68 కోట్లు ఫీజు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.2,274.77 కోట్లకు పెరిగిపోవడంతో ఫీజుతో పాటు జీఎస్‌టీ కలిపి కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top