
ఇక్కడతో ఆపేస్తే అది చిన్న మున్సిపాలిటీగానే ఉంటుంది
విమానాశ్రయం, పరిశ్రమలొస్తేనే అక్కడ భూముల విలువ పెరుగుతుంది
రాజధాని ల్యాండ్ మోనటైజేషన్ ప్రాజెక్టు
‘వే 2 న్యూస్’ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతి విస్తరణకు రైతుల నుంచి ఇంకా భూమి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఇక్కడతోనే అభివృద్ధి ఆపేస్తే అమరావతి చిన్న మున్సిపాలిటీగానే మిగిలిపోతుందన్నారు. వే 2 న్యూస్ సంస్థ మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పరిశ్రమలు వస్తేనే అక్కడ భూముల విలువ పెరుగుతుందన్నారు. మరింత భూమి తీసుకోకపోతే అభివృద్ధి 33 వేల ఎకరాలకే పరిమితమవుతుందన్నారు.
అలాగే, రాజధాని ల్యాండ్ మోనటైజేషన్ ప్రాజెక్టు అని చెప్పారు. హైటెక్ సిటీ రాకముందు హైదరాబాద్‌లో ఎకరం లక్ష రూపాయలే ఉండేదని.. ఇప్పుడు ఎకరం రూ.100 కోట్లకు చేరిందన్నారు. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారాలంటే గుంటూరు–విజయవాడ–తెనాలి వాటి పరిసర గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు. క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టామని.. క్వాంటమ్ కంప్యూటింగ్‌కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయని చంద్రబాబు చెప్పారు.
అలాగే, ప్రముఖ విద్యా సంస్థలు రాబోతున్నాయన్నారు. అమరావతిలో ప్రారంభించిన ప్రతీ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందని.. వీటిని ప్రధాని ప్రారంభిస్తారని ఆయనన్నారు. ఇక మెడికల్ కాలేజీలు కట్టకుండా, కట్టేశామని చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము ప్రైవేట్ వారికి వాటిని అప్పజెప్పడంలేదని.. పీపీపీ పద్ధతిలోనే నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, నిర్వహణ ప్రభుత్వానిదేనని అన్నారు.