
ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో సీఆర్‌డీఏ కమిషనర్ బెదిరించారు
భూసమీకరణ కింద ఇవ్వని మా భూములను జీవీ ఎస్టేట్స్, అండ్ హాస్టల్స్ సంస్థకు కేటాయించారు
ఆ భూములను ఖాళీచేయాలని బెదిరించారు
భూముల్లోకి యంత్రాలతో దౌర్జన్యంగా ప్రవేశించి కంచె తొలగించారు
రాజధానికి 2014 డిసెంబర్‌లోను ఇదే తరహాలో భూములు లాక్కున్నారు
ఏడీబీ, ప్రపంచబ్యాంకు బృందానికి మందడం రైతుల ఫిర్యాదు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో చట్టబద్ధంగా తమకు హక్కులు ఉన్న భూమిని జీవీ ఎస్టేట్స్ అండ్ హాస్టల్స్ సంస్థకు కేటాయించి.. ఆ భూమిని ఖాళీచేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ నేరుగా తమను బెదిరించారని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు శుక్రవారం మందడం గ్రామ రైతులు పసుపులేటి జమలయ్య, కలపాల శరత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. భూసమీకరణ కింద తాము భూములు ఇవ్వలేదని చెప్పినా.. ఈ నెల 5న యంత్రాలతో దౌర్జన్యంగా కంచె (ఫెన్సింగ్)ను తొలగించి భూముల్లోకి ప్రవేశించి, లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు.
అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా అందజేశారు. ఈ దౌర్జన్యంపై ఈ నెల 9న తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసేందుకు ఆ అధికారి విముఖత వ్యక్తం చేస్తూ, భూసమీకరణ కింద మీ భూములను ఇవ్వాల్సిందేనని ఆదేశించారని చెప్పారు. ఏడీబీ సేఫ్‌గార్డ్ పాలసీ స్టేట్‌మెంట్ (ఎస్‌పీఎస్ 2009), వరల్డ్‌బ్యాంక్ ఎన్విరాన్‌మెంట్ సోషల్ ఫ్రేమ్‌వర్క్ (ఈఎస్‌ఎఫ్ 2018) ప్రకారం బలవంతంగా భూములు తీసుకోకూడదని, సీఆర్‌డీఏ అధికారులు వాటిని ఉల్లంఘించి తమ హక్కులను కాలరాస్తున్నారని వివరించారు.
ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకుని తమ హక్కులు పరరిక్షించాలని వారు కోరారు. తుళ్లూరు మండలం మందడంలో సర్వే నంబరు 225/1లో పసుపులేటి జమలయ్యకు 0.40 ఎకరాలు, సర్వే నంబరు 225/1లో కలపాల శరత్‌కుమార్‌కు 0.30 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తాము భూసమీకరణ కింద సీఆర్‌డీఏకి ఇవ్వలేదని వారు చెప్పారు.
అప్పట్లో పంటలు తగులబెట్టారు
రాజధానికి భూసమీకరణ కింద భూములు ఇవ్వని గ్రామాల్లో 2014 డిసెంబర్‌లో జరిగిన దౌర్జన్యాలు, దాష్టీకాలను ఏడీబీ, ప్రపంచబ్యాంకు దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. అప్పట్లో ఆరు గ్రామాల్లో అరటి పంటను రైతులు సాగుచేసేవారని.. ఆ భూములను భూసమీకరణ కింద రాజధానికి ఇచ్చేందుకు రైతులు నిరాకరించారని తెలిపారు. భూములు ఇచ్చేందుకు అంగీకరించని రైతులను బెదిరించారని, సాగుచేసిన పంటలకు నిప్పుపెట్టి కాల్చేశారని చెప్పారు.
ఇప్పుడు భూములు ఇచ్చేందుకు అంగీకరించని తమపైన కూడా అదేరీతిలో దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఈ దౌర్జన్యకాండపై ఈనెల 10న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్, డీజీపీ, ఎస్పీ, డీఎస్పీ, ఏడీసీఎల్ చైర్‌పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తుళ్లూరు ఎస్‌ఐ, సీఐ, హోంమంత్రి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు.