
పెద్ద హనుమంతునిపై వెంకన్న విహారం
పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం ఉదయం రామబంటు హనుమంతున్ని వాహనంగా చేసుకుని పురవీధుల్లో విహరించారు.
నారాయణవనం,న్యూస్‌లైన్ : పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం ఉదయం రామబంటు హనుమంతున్ని వాహనంగా చేసుకుని పురవీధుల్లో విహరించారు. గజ, వృషభాలతో భజన బృందాలు, కేరళ సాంస్కృతిక మేళాలతో స్వామి వారి ఊరేగింపు కొనసాగింది. సాయంత్రం శ్వేతాంబరాలను ధరించిన శ్రీదేవి,. భూదేవితో కల్యాణ వెంకన్న వసంతోత్సవంలో పాల్గొన్నారు.
రాత్రి గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వేకువజామున 5 గంటలకు సుప్రభాతసేవతో పాటు నిత్యకట్ల, శుద్ధి, గంట తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తి చేశారు. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 8.30 గంటలకు గ్రామోత్సవంలో పెద్దహనుమంతునిపై అధిరోహించిన స్వామి వారు భక్తుల నుంచి హారతులను అందుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఉభయ నాంచారులతో కలిసి స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, పసుపుతో అభిషేకాలు చేశారు.
సాయంత్రం కైంకర్యాల అనంతరం తిరుచ్చి వాహనంపై వెంకన్న ఉభనాంచారులతో తెల్లటి పట్టు వస్త్రాలను ధరించి మాడ వీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా స్వామి పరిచారకులు భక్తులపై సుగంధ ద్రవాలతో కూడిన తిరువర్ణాలను చల్లారు. రాత్రి 8 గంటలకు తెల్లటి ఐరావతాన్ని అధిరోహించి స్వామివారు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు కనులవిందు చేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకన్న ఆలయంతో పాటు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి బాలనరసింహరావు, సహాయకులు వీరయ్య, షరాబ్‌లు మణి, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆర్జిత కల్యాణంలో పాల్గొనండి
బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి ఆలయంలో కల్యాణ వెంకటేశ్వరస్వామికి నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో దంపతులు పాల్గొనాలని స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్ కోరారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి రెండున్నర గంటల పాటు ఆర్జిత కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఆలయ కార్యాలయంలో 500 రూపాయల రుసుము చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు వస్త్ర బహుమానం ఇస్తారని తెలిపారు.