జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

Ex CM Nedurumalli Janardhana Reddy Son Ram Kumar Joins in YSRCP - Sakshi

వైఎస్సార్‌సీపీలోకి నేదురుమల్లి రామ్‌

విశాఖలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

రామ్‌తో పాటు నేదురుమల్లి వర్గీయులు పలువురు  

జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లిన నేదురుమల్లి అనుచరులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం లక్ష్యంగా తన వంతు పనిచేస్తానని మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, ముఖ్యనేతల సమన్వయంతో సమష్టిగా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కోటనరవలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్‌ రామ్‌కుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

 నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితో పాటు గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేదురుమల్లి వర్గీయులు పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి నేదురుమల్లి వర్గీయులు భారీ ర్యాలీగా విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ఆయనతో పాటు నేదురుమల్లి ముఖ్య అనుచరులు దామోదర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ద్వారకానా«త్, సుధాకర్‌నాయుడు, రామయ్యనాయుడు, ఎల్‌ కోటేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి  పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ సీఈసీ సభ్యుడు యల్లసిరి గోపాల్‌రెడ్డి, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోసం జనం ఎదురు చూపు
ఈ రాష్ట్రంలో ఎన్నికల కోసం 13 జిల్లాల్లోని ప్రజలు ఎదురు చూస్తున్నారని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు.  పూర్వకాలంలో రాజులు దేశాటన చేసి పరిస్థితులను అవగతం చేసుకుని పట్టాభిషిక్తులు అయిన తర్వాత ఆ దేశ ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకునే వారన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు నమ్మకం, అభిమానం ఉన్నాయని, అవే ఆయన్ను పట్టాభిషిక్తుడిని చేస్తాయని తెలిపారు. 

గతంలో అనుభవజ్ఞుడన్న కారణంతో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారని, ఆయన అన్నీ వర్గాలను వంచించారని తెలిపారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. నేదురుమల్లి అభిమానుల అభీష్టం మేరకు వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని, నేదురుమల్లి అభిమానులు చేరడంతో ఇంకా తిరుగులేని శక్తిగా మారిందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top