ఇప్పుడిప్పుడే వర్షం తగ్గిందనుకుంటున్న తరుణంలో బుధవారం మళ్లీ వర్షం మొదలవ్వడం జిల్లావాసులను బెంబేలెత్తిస్తోంది.
పొంగుతున్న వాగులు, వంకలు
కలవరపడుతున్న జిల్లావాసులు
పంటలకు భారీ నష్టం
బిక్కుబిక్కుమంటున్న ముంపు బాధితులు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
తిరుపతి: ఇప్పుడిప్పుడే వర్షం తగ్గిందనుకుంటున్న తరుణంలో బుధవారం మళ్లీ వర్షం మొదలవ్వడం జిల్లావాసులను బెంబేలెత్తిస్తోంది. మధ్యాహ్నం కాస్త తెరపిచ్చినా సాయంత్రం నుంచి తిరిగి వాన జోరందుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశ మార్చుకోవడంతో వర్షం మొదలైందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీంతో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా అన్ని పనులు మానుకుని ఇంటిపట్టునే ఉండిపోవడంతో పలువురికి ఉపాధికి దెబ్బపడింది. వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. నిత్యావసర వస్తువులు మినహా ఇతరాత్ర అన్ని దుకాణాలు వెలవెలపోతున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలను పునరుద్ధరిస్తున్న తరుణంలో వర్షం ఊపందుకోవడంతో అధికారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏమార్గంలో రాకపోకలు నిలిపివేస్తారోనన్న భయం ప్రయాణికులను వెంటాడుతోంది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాయి. శ్రీకాళహస్తి ప ట్టణంలో ముంపు బాధితప్రాంతాలను ఎంపీ వరప్రసాద్ సందర్శిం చారు. తాజావానలతో ముంపు బాధితులు కలవరపడుతున్నారు. నగరి నియోజక వర్గంలో వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలలో ఎమ్యేల్యే రోజా పర్యటించారు.
అధికారుల కాకిలెక్కలు...
తుఫాన్ వల్ల భారీనష్టం జరిగినా క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా అధికారు లు కాకిలెక్కలతో మభ్యపెడుతున్నారు. కేవలం 770 హెక్టార్లలో ఉద్యాన పంట లు, 2637 హెక్టార్లలో అన్ని రకాల పం టలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నివేదికలకు వాస్తవానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని రైతులు, రైతుసంఘాల నాయకులంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నా అధికారులు మాత్రం వాటి సంఖ్యను స్వల్పంగానే చూపిస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో దాదాపు 90 శా తంకు పైగా చెరువులు నిండినట్లు నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి వద్ద తెలుగుగంగ కాలువకు గండ్లు పడటంతో లోతట్టు గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. కనపర్తి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకొంది..46 చెరువులకు గండ్లు పడ్డాయి.
మంత్రుల సమీక్ష...
తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై మంత్రులు చినరాజప్ప, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. భాధిత కుటుంబాలకు 25 కిలో బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్,కేజీ కందిప్పు,చక్కెర,పామాయిల్ ఇస్తున్నట్లు తెలిపారు హుద్ తుఫాను మాదిరే నష్ట పరిహారం ఇస్తామన్నారు. హోమంత్రి చిన్న రాజప్ప మాట్లాడుతూ ఈ వర్షాలు సీమ జిల్లాలకు మేలు కలిగేలా ఉన్నాయని తెలిపారు.37 పునరావాస కేంద్రాలు ఏర్పాట చేసి 5000ల మందిని తరలించినట్లు వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. చనిపోయిన పశువుకు రూ 20,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యాసంస్థలకు గురువారం కూడా సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కొండెక్కిన కూరగాయలు...
తుఫాన్ కారణంగా కూరగాయల దిగుమతికి అంతరాయం కల్గడంతో ధరలు చుక్కలన్నంటాయి. టమోటా మాత్రమే కొండెక్కిందంటే కిలో వంకాయలు సైతం రూ 50 ధర పలికాయి. ఏ కాయగూర కొందామన్నా కిలో రూ.40- 60 మధ్య ధర పలికింది. ఆకు కూర సైతం కట్ట రూ. 15 రూపాయలకు అమ్మడం గమనార్హం..
సీఎం ఏరియల్ సర్వే...
తుఫాను ప్రభావిత ప్రాంతా ల్లో మఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 20 నిమిషాల పాటు ఏరియల్ సర్వే చేశారు. కాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట ప్రాంతాల్లో పర్యటించి అంచనా వేశారు.