ఎక్కడివారక్కడే గప్‌చుప్‌..!

Employees Transfer In Endowment Department In Prakasam - Sakshi

బదిలీల జీవోను బేఖాతర్‌

పలుచోట్ల ఎనిమిదేళ్లుగా ఈవోల తిష్ట

రికవరీలకు నో

దేవదాయశాఖలో ఇదీ తంతు

సాక్షి, ఒంగోలు: సహజంగా ఏటా దేవదాయ, ధర్మాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుంటారు. జూన్‌ నెల 25వ తేదీ నుంచి ఈ మేరకు బదిలీలు ప్రారంభమయ్యాయి. జీవో ఎంఎస్‌ నంబర్‌ 46 పేరుతో దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం కూడా జూన్‌ 26న జీవో ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జూన్‌ 24వ తేదీ నుంచి బదిలీలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో బదిలీల ప్రక్రియ జిల్లాలో మూడు రోజులుగా నిలిచిపోయింది. కారణం సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం. జిల్లాను యూనిట్‌గా చేసుకున్నప్పుడు అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంది. గడిచిన ఏడాది కాలంగా జిల్లా దేవదాయ శాఖకు ఓ రకంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ లేనట్టే. శ్రీరామమూర్తి సెలవులో వెళ్లినప్పటి నుంచి దేవదాయ శాఖకు అసిస్టెంట్‌ కమిషనర్‌ లేరు.  తాజాగా నియమితులైన అధికారి కూడా నియామకం అయిన వారం రోజుల తర్వాత కూడా విధుల్లో చేరలేదు. 

ఎక్కడివారక్కడే..
నిజానికి బదిలీల ప్రక్రియ నిర్వహించాలంటే తొలుత ఏయే గ్రూప్స్‌ ఆలయాల కార్య నిర్వహణాధికారులు ఎంతెంత కాలం నుంచి విధులు నిర్వహిస్తున్నారనే విషయంలో జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కమిషనరేట్‌ కార్యాలయానికి నివేదికలు ఇవ్వాలి. కానీ, నివేదికలు ఇచ్చేటప్పుడే అసమగ్ర నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం  ప్రకటించిన షెడ్యూల్‌ను అనుసరించి నిర్దేశిత తేదీలను అధికారులు పట్టించుకోరు. తద్వారా బదిలీలకు నిర్దేశించిన తేదీల్లో హడావిడిగా, నువ్వక్కడ, నేనిక్కడ అన్న రీతిలో బదిలీలు నిర్వహిస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్‌లో పారదర్శకతను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

బదిలీలకు తప్పుడు నివేదికలు 
మ్యూచువల్‌ అండర్‌ స్టాండింగ్‌ను ప్రభుత్వ ఉత్తర్వులుగా మార్చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి తప్పుడు నివేదికలు ఇవ్వడం, బదిలీల సమయంలో అందుబాటులో ఉండక పోవడం, అనంతరం రాజకీయంగా ప్రాతినిధ్యం చేసి ఒకేచోట ఉండిపోవటం అనేది పలుచోట్ల ఈవోలు చేస్తున్న వ్యవహారం.  ఈ క్రమంలో కమిషనర్‌ కార్యాలయం కూడా ఏ ఒకరిద్దరినో బదిలీ చేస్తున్నట్టు చూపించడంతో ప్రక్రియను సరిపెట్టేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్‌ స్థాయిలో పారదర్శక నివేదికలతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా నిర్వహించాల్సిన ఈవోల బదిలీలు తూతూ మంత్రంగా జరుపుతూ దేవదాయ – ధర్మదాయ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రికవరీల ఊసేది?
జిల్లాలో పలు చోట్ల దేవదాయ–ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన నిధులు గోల్‌మాల్‌ అవుతున్నాయి. భక్తుల కానుకలు నివేదికల్లో అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఇటీవల పొందూరు గ్రూప్‌ ఆలయ పరిధిలో రూ.23లక్షల కుంభకోణం జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి విచారణలు చేసి రికవరీ చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇంకో విచిత్రం ఏమంటే, నిధుల అవకతవకలు జరిగిన ప్రాంతాల్లోని ఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించటం దేవదాయ, ధర్మదాయ శాఖలో కొసమెరుపు. సత్వరం సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బదిలీలు పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహింపజేసి దేవాలయాల ఉన్నతికి పాటు పడాలని ఆయా ప్రాంతాల్లో భక్తులు కోరుతున్నారు.

పాతుకుపోతున్న ఈవోలు
జిల్లాలోని ఆలయాల కార్యనిర్వహణాధికారులు 50మంది వరకు ఉన్నారు. వీరిలో ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన వారు కొందరు ఉండగా, అధికులు జూనియర్‌ అసిస్టెంట్‌ హోదా నుంచి వచ్చి ఈవోగా పదోన్నతులు పొందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఒంగోలు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసు నుంచే తప్పుడు సమాచారం ఇస్తుంటారు. జిల్లాలో ఉన్న 50మంది ఈవోల్లో అధిక శాతం మంది ఎక్కడివాళ్లక్కడ పాతుకు పోయారు. అధిక ఈవోలు 8,9 ఏళ్లుగా తాము నియామకం అయినచోటే పాతుకుపోయారు.
సింగరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈవోగా ఉన్న అధికారి తొమ్మిదేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక ఆయన్ని మళ్లీ కోటప్పకొండకు ఇన్‌చార్జి ఈవోగా కూడా గత ప్రభుత్వ హయాంలో నియమించారు.
ఒంగోలు గ్రూప్‌ ఆలయాల ఈవో తొమ్మిదేళ్లుగా, కొత్తపట్నం గ్రూప్‌ ఆలయాల ఈవో ఐదేళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు.
కారంచేడు గ్రూప్‌ దేవాలయాలకు కూడా ఈవో సుదీర్ఘకాలంగా బదిలీకి దూరంగా ఉన్నారు.
కొప్పోలు గ్రూప్‌ ఆలయాల కార్యనిర్వహణాధికారి సుధీర్ఘకాలంగా బదిలీ కాలేదు.
పొదిలి గ్రూప్‌ టెంపుల్స్‌కు చెందిన నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం(పొదిలికొండ) తదితరాల ఆలయాల ఈవోలు కూడా బదిలీలకు దూరం.
మార్టూరు మండలంలోనూ అదే పరిస్థితి. ఈ ప్రాంతంలో 19 ఆలయాలకు ఒకరే ఈవో, వీరు కూడా అనేక ఏళ్లుగా బదిలీకి దూరంగా ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా మేనేజర్‌ హోదా కూడా ఉంది.
ఇలా మార్కాపురం, కందుకూరు, పర్చూరు డివిజన్‌లలోని పలు ఆలయాల ఈవోలు ఒకేచోట ఏళ్ల తరబడి పాతుకుపోయారు. దీంతో బదిలీలకు మొహం చాటేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top