బినామీ డీలర్ల ప్రక్షాళనకు చర్యలు

E Pass Missions Check To Binami Dealers - Sakshi

ఈ పోస్‌ యంత్రంలో నామినీల పేర్లు తొలగింపు

గందరగోళంలో రేషన్‌ డీలర్లు

దేవరపల్లి: బినామీ రేషన్‌ డీలర్ల వ్యవస్థపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో బినామీలకు చెక్‌ పెట్టడానికి చర్యలు చేపట్టింది. బినామీ డీలర్ల వల్ల ప్రజాపంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన అధికారులు ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈ–పోస్‌ యంత్రంలోని నామినీ పేర్ల్లను మే 1 నుంచి తొలగించారు. ఇప్పటివరకు డీలర్‌తో పాటు మరో ఇద్దరు పేర్లు నామినీగా చేర్చి వేలిముద్రలు ఇచ్చారు. మూడేళ్లుగా నామినీల వ్యవస్థ నడుస్తుంది. దీని కారణంగా ఒరిజినల్‌ డీలర్‌ వేరే ప్రాంతంలో ఉండి బినామీల పేరును నామినీగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో నామినీ వ్యవస్థను రద్దుచేసి ఒరిజినల్‌ డీలర్ల పేరు మాత్రమే యంత్రంలో ఉంచితే బినామీల సంఖ్య బయటపడుతుందని అధికారులు ఆలోచన చేశారు.

ఈమేరకు మే 1 నుంచి ఈ–పోస్‌ యంత్రంలో డీలర్‌ పేరు మాత్రమే ఉంచి నామినీలను తొలగించారు. దీనిపై రేషన్‌ డీలర్లలో గందగోళ పరిస్థితి ఏర్పడింది. నామినీ పేరు లేకుండా దుకాణాలు నడపటం కష్టమని డీలర్లు అంటున్నారు. డీలర్లలో వృద్ధులు, అనారోగ్యవంతులు ఉన్నారని వీరు నామినీ లేకపోతే ఇబ్బంది పడతారని డీలర్ల సంఘ ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. డీలర్‌ రక్తసంబంధీకులను నామినీగా చేర్చాలని కోరుతున్నారు. నామినీ వ్యవస్థను పునరుద్ధరించకపోతే దుకాణాలు నిర్వహణ చేయలేమని, అవసరం అయితే దుకాణాలను స్వచ్ఛందంగా వదులుకుం టామని చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2,163 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. మారుమూల గ్రామాలు, కొండప్రాంతాల్లో ఈ పోస్‌ విధానం అమలు జరగడం లేదు.

నామినీ తొలగింపుపై సీఎంను కలుస్తాం
ఈ పోస్‌ యంత్రంలో నామినీ పేర్లు తొలగింపుపై ఈనెల 5న ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు టీఏవీవీఎల్‌ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నామినీ పేరు తొలగింపు పట్ల డీలర్లు ఆందోళన చెందనవసం లేదన్నారు. ఇది బినామీ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య మాత్రమేనని అన్నారు. కుటుంబంలో రక్తసంబంధీకులకు నామినీ ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. దుకాణాలను బంద్‌ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆయన డీలర్లకు సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top