శిశు శోకం | Doctors Scarcity In Government Hospitals For Deliveries | Sakshi
Sakshi News home page

శిశు శోకం

Oct 21 2018 2:09 PM | Updated on Oct 21 2018 2:09 PM

Doctors Scarcity In Government Hospitals For Deliveries - Sakshi

ప్రభుత్వ వైద్యశాలల్లో శిశువుల మృత్యుఘోష మోగుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. శిశువుల పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య నిపుణుల కొరత.. అత్యవసరమైన సమయంలో ప్రాణాధార సదుపాయాలు లేకపోవడం, గర్భిణులకు పౌష్టికాహారం సరిగా అందకపోవడం, వారు రక్తహీనతకు లోనవుతుండడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు చేయకపోవడం తదితర పరిస్థితులు శిశు మరణాలకు కారణమవుతున్నాయి. 

గూడూరుకు చెందిన రమణమ్మ (పేరు మార్చాం) కాన్పు కోసం గూడూరు ఏరియా ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి (జీజీహెచ్‌) తీసుకెళ్లమన్నారు. జీజీహెచ్‌లో కాన్పు అనంతరం బిడ్డ చనిపోయింది. గూడూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులు ఉండి ఉంటే, అక్కడే కాన్పు జరిగినట్టయితే బిడ్డ బతికి ఉండేదంటున్నారు బాధితురాలి బంధువులు. జిల్లాలో ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ అనేకం చోటు చేసుకుంటున్నాయి.

నెల్లూరు(బారకాసు) :  జిల్లాలో నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రితో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు ఏరియా ఆస్పత్రులు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉన్నాయి. వీటిలో 24 గంటలు పనిచేసే  పీహెచ్‌సీలు 28 ఉన్నాయి. సీహెచ్‌సీ కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో తల్లులతో పాటు పిల్లలకూ వైద్యం అందించాల్సి ఉంది. అయితే నెల్లూరు జీజీహెచ్‌లో మాత్రమే నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏడాది లోపు పిల్లలకు ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడినా జీజీహెచ్‌కు రావాల్సిందే.

ఫలితంగా ఈ విభాగంలోని నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ), సిక్‌ న్నూబార్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)లకు శిశువుల తాకిడి అధికమవుతోంది. ప్రాణాధార సదుపాయాలూ లేవు పసిపిల్లలకు ప్రాణాధారమైన నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను (ఎన్‌ఐసీయూ) ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒక్క సీహెచ్‌సీలో కూడా దీన్ని ఏర్పాటు చేయలేదు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల చిన్నపిల్లల విభాగంలో తగినంత మంది వైద్యులు సైతం లేరు. ఈ విభాగంలో ఓపీ కోసం నిత్యం 100 మంది వరకు వస్తుంటారు.  20 నుంచి 30 మందికి పైగా పసిపిల్లలు ఇన్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. 

పోషకాహారం కరువు 
నెలలు నిండక ముందే జన్మించడం, గర్భంతో ఉన్నప్పుడు తల్లికి బీపీ అధికంగా ఉండటం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం శిశువుల మరణాలకు ప్రధాన కారణాలవుతున్నాయి. ఇలాంటి సమస్యలను నివారించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు అందించే పోషకాహారం నాసిరకంగా ఉంటోంది. అది కూడా సక్రమంగా తల్లికి అందడం లేదు. గర్భిణులు ఇంటికి తీసుకెళ్లిన సరుకులు కుటుంబ సభ్యులందరి ఆహారంలో భాగం కావడం వల్ల తల్లికి పోషకాహార లోపం ఏర్పడుతోంది. ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతోంది. 

పిల్లల వైద్యులకు తీవ్ర కొరత
జిల్లాలోని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి గైనకాలజిస్ట్‌తో పాటు పిడియాట్రిషియన్, అనెస్థిటిస్ట్‌ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. కానీ 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు గాను 10 కేంద్రాల్లోనే పిడియాట్రిషయన్లు ఉన్నారు. 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు జిల్లాలో 28 ఉన్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో  కాన్సులు సైతం సరిగా జరగడం లేదు. అధిక శాతం ప్రసవాలు నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. నెల్లూరు జీజీహెచ్‌ చిన్నపిల్లల విభాగంలో మూడు యూనిట్లు ఉన్నాయి. అందులో ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్ట్‌ వైద్యులు మాత్రమే ఉన్నారు. పిల్లల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అందుకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరముందని వైద్యులు చెబుతున్నారు. 

వైద్యుల కొరత వాస్తవమే
జీజీహెచ్‌ చిన్నపిల్లల విభాగంలో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇక్కడ నియమించిన వైద్యుల్లో చాలా మంది డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఖాళీ పోస్టుల్లో వైద్యులను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ఉన్నతాధికారులదే.   త్వరలో వైద్యుల రిక్రూట్‌మెంట్‌ జరగాల్సి ఉంది. అది జరిగితే ఇక్కడికి వైద్యులు వచ్చే అవకాశముంది. స్థానికంగా నలుగురు ప్రైవేట్‌ వైద్యులతో మాట్లాడాం. త్వరలో వారి ద్వారా సేవలు అందిస్తాం.
–  డాక్టర్‌ రాధాకృష్ణరాజు, సూపరింటెండెంట్, జీజీహెచ్‌  

శిశు మరణాల నివారణకు చర్యలు  
శిశు మరణాలను తగ్గించేందుకు మా వంతు చర్యలు చేపడుతున్నాం. గర్భిణులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా చూడాలని ఐసీడీఎస్‌ సిబ్బందికి చెబుతున్నాం. రక్తహీనత ఉన్నవారికి ఐర¯న్‌ మాత్రలు ఇవ్వడంతో పాటు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నాం. అయినా జిల్లాలో అక్కడక్కడా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే నెల్లూరు జిల్లాలో నమోదవుతున్న శిశు మరణాలు తక్కువే.   – డాక్టర్‌ వరసుందరం, డీఎంహెచ్‌ఓ, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement