పండగ వచ్చిందంటే ప్రత్యేకంగా కనబడాలనే ఆరాటం ఖరీదైన వస్తువుల కొనుగోళ్లవైపు నడిపిస్తోంది. బట్టలు, గాజులు, కాస్మెటిక్స్, మ్యాచింగ్ సెంటర్లలో కొనుగోలు కోసం వచ్చిపోయే మహిళలతో వ్యాపార కూడళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆలస్యమైతే మంచి డిజైన్‌లు దొరకవనే ఉద్దేశంతో ఎవరి శక్తిమేరకు వారు ముందుగానే కొనుగోళ్లు చేస్తున్నారు.
జిల్లాకు పండగ కళ వచ్చేసింది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా పండగ వాతావరణం సంతరించుకొంది. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండగలైన సద్దుల బతుకమ్మ, దసరాకు పది రోజుల ముందు నుంచే కొనుగోళ్ల సందడి మొదలైంది. ఈ రెండు పండగలకు తెలుగు పండగల్లో మరే పండగలకూ లేనంత జోష్ ఉంటుంది. మహిళలు బతుకమ్మ కోసం పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు ప్రత్యేకంగా భావిస్తారు. పేద, గొప్ప తేడా లేకుండా అందరూ దసరా పండగకు కొత్త బట్టలు కొనుక్కొని ధరించడం సాంప్రదాయం. సంవత్సరంలో ఎన్నో పండగలు వస్తూ పోతూ ఉన్నా బతుకమ్మ, దసరా పండగలకే పెద్ద క్రేజ్. దీనికితోడు కార్మికులకు, ఉద్యోగులకు పండగ అడ్వాన్సులు ఇస్తుండడంతో కొనుగోల్లు జోరందుకున్నాయి.
- న్యూస్‌లైన్, టవర్‌సర్కిల్
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : పండగ వచ్చిందంటే ప్రత్యేకంగా కనబడాలనే ఆరాటం ఖరీదైన వస్తువుల కొనుగోళ్లవైపు నడిపిస్తోంది. బట్టలు, గాజులు, కాస్మెటిక్స్, మ్యాచింగ్ సెంటర్లలో కొనుగోలు కోసం వచ్చిపోయే మహిళలతో వ్యాపార కూడళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆలస్యమైతే మంచి డిజైన్‌లు దొరకవనే ఉద్దేశంతో ఎవరి శక్తిమేరకు వారు ముందుగానే కొనుగోళ్లు చేస్తున్నారు.
పల్లెల నుంచి కొనుగోళ్లకు వచ్చే వారే ముందు వరుసలో ఉంటున్నారు. కూలీనాలీ చేసుకునేవారు సైతం పిల్లలకు పండగ బట్టలు కొనుగోలు చేసేందుకు అప్పుచేయడానికి కూడా వెనుకాడడం లేదు. మిగతా రోజుల్లో ఎప్పుడూ లేనంతగా గిరాకీ ఉండడంతో దుకాణదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిజైన్‌లు చూపించలేక సతమతమవుతున్నారు. టైలరింగ్ షాపుల్లోనూ బిజీ నెలకొంది. వారం ముందే ఇక బట్టలు కుట్టడం వీలుకాదని చెప్పే పరిస్థితి నెలకొంది.
బట్టలదే అగ్రస్థానం...
బతుకమ్మ, దసరా పండగలంటే బట్టలదే అగ్రస్థానం. ప్రతి వ్యక్తి పండగలకు కొత్త బట్టలు కొ నుగోలు చేస్తుంటారు. బట్టల కొనుగోళ్లలో మహిళలే ముందుటున్నారు. దుకాణాలు సైతం ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. పెద్దపెద్ద మాల్స్ వచ్చాక ఫిక్స్‌డ్ రేట్లకు అలవాటుపడ్డ ప్రజలు, దానిపై ఇచ్చే డిస్కౌంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే వారి వద్దే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా రు.
పజల ఆసక్తిని గమనించి వ్యాపారులు పోటీపోటీగా రేట్లను ప్రదర్శన పెట్టి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. చిన్న దుకాణాలు సైతం మాల్స్‌తో పోటీపడి విక్రయాలు జరుపుతున్నాయి. రేడీమేడ్ వస్త్ర వ్యాపారం బాగా పుంజు కుంది. బట్ట కొనుగోలుచేసి దానిని కుట్టించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. రెడీమేడ్ షాపులు సైతం అందరికి అందుబాటు ధరలలో వస్త్రాలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా కిడ్స్, మెన్స్‌వేర్‌లు మార్కెట్‌లను ముంచెత్తుతున్నాయి. ముంబయి, కోల్‌కతా, సూరత్, హైదరాబాద్ వంటి నగరాల నుంచి స్టాక్ తెప్పిస్తున్నారు. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి బట్టలు కొనుగోలు చేసేవారు సైతం ఇప్పుడు అన్ని బ్రాండెడ్ షోరూంలు అందుబాటులోకి రావడంతో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు.
రూ.వెయ్యి కోట్ల పైనే..
బతుకమ్మ, దసరా పండగలకు కొత్త బట్టలు, వాటి మ్యాచింగ్, గాజులు, కాస్మెటిక్స్, చెప్పుల కోసం జిల్లా ప్రజలు చేసే ఖర్చు రూ.వెయ్యికోట్ల వరకు ఉంటుందని అంచనా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పండగ సీజన్‌లో ఒక్క బట్టలపైనే రూ.800 కోట్లకు పైగా విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
బట్టలకు తోడు మ్యాచింగ్‌లు, గాజులు, చెప్పులు, కాస్మెటిక్స్ చాలా ఖరీరయ్యాయి. మిగతావి అన్నీ కలిసి రూ.200 కోట్లపైనే వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నలుగురిలో చిన్నతనంగా కనబడకూడదనే తపనతో ఇంటిల్లిపాది మంచి బట్టలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేస్తే సంవత్సరాంతం కూడబెట్టిన డబ్బులన్నీ దసరా పండగకే ఖర్చవుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు.