నవ్వు‘తారు’.. సూరీ! 

Dharmavaram Former MLA Gonuguntla Suryanarayana Corruption In Road Construction - Sakshi

నాసిరకంగా అనంతపురం–కదిరి రోడ్డు 

మొరుసుకు బదులు నల్లమట్టి వినియోగం 

టీడీపీ హయాంలో చక్రం తిప్పిన సూరి 

ధర్మవరం నియోజకవర్గంలో పనులన్నీఆయన కనుసన్నల్లోనే.. 

నాణ్యతపై విజిలెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ 

విచారణ చేపడితే వెలుగులోకి బాగోతం 

సూరి. ఈ పేరు చర్చకు వస్తే మొదటగా గుర్తొచ్చేది వెన్నుపోటు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు వెంటనడిచిన ‘తమ్ముళ్ల’ను గాలికొదిలేసి సొంత ‘వ్యాపారం’ చూసుకునేందుకు పార్టీ ఫిరాయించిన నేతగానే ఇప్పుడు ధర్మవరం చూస్తోంది. అధికారంలో ఉండగా దక్కించుకొన్న కాంట్రాక్టుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో బతుకుజీవుడా అని ‘కమలం’ పంచన చేరడం తెలిసిందే. ఈ కోవలోనే ఆయన చేపడుతున్న అనంతపురం–కదిరి రహదారి పనులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆ నల్లని రోడ్డు వెనుక దాగిన అవినీతి ఔరా అనిపిస్తుంది. 

సాక్షి, అనంతపురం:  నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ చేపడుతున్న రోడ్డు పనుల్లో నాణ్యత నవ్వులపాలవుతోంది. ఎక్కడా నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు కనిపించవు. రోడ్డు పూర్తి చేస్తున్నారనే మాటే కానీ.. నాలుగు కాలాల పాటు నిలుస్తుందనే నమ్మకం కనిపించదు. అనంతపురం–కదిరి రహదారి పనులే ఆ సంస్థ తాజా అవినీతికి నిదర్శనం. రోడ్డు పనుల్లో ఎర్రమట్టి, గులకరాళ్లతో కూడిన మొరుసును కాకుండా నల్లమట్టి, సుద్దను వినియోగిస్తుండటం చూస్తే ఈ రోడ్డు ఎంతకాలం నిలుస్తుందో ఇట్టే అర్థమవుతుంది. మొరుసు కంటే నల్లమట్టి, సుద్ద తక్కువ ధరకు లభిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే సూరి నిబంధనలకు నీళ్లొదిలారు. ఈ కారణంగా రోడ్డు పక్కన వాహనం వెళితే.. ప్రధానంగా వర్షాకాలంలో దిగబడిపోయి చుక్కలు చూడాల్సిందే. ఇకపోతే అధికారికంగా వాహనాల రాకపోకలు ప్రారంభం కాకముందే రోడ్డు తేలిపోయింది. నాసిరకంగా కంకర తేలి దర్శనమిస్తోంది. ఎక్కడికక్కడ ప్యాచులు వేయడంతో పాటు.. పనుల్లో వినియోగిస్తున్న కంకర కూడా పొడిగా ఉండటం నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తోంది. 

తేలిపోతున్న నాణ్యత...! 
వాస్తవానికి జాతీయ రహదారి పనులను ఎంతో నాణ్యతగా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా అప్పుడే రోడ్డు కాస్తా కంకర తేలి నాసిరకంగా దర్శనమిస్తోంది. అనంతపురం నుంచి కదిరి వరకు వెళ్లే మార్గంలో 76 కిలోమీటరు నుంచి 99.92 కిలోమీటరు వరకు మొత్తం 22.92 కిలోమీటర్ల పొడవున ఈ పనులను సూరికి చెందిన నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ చేపడుతోంది. ఇప్పటివరకు సుమారు 18 కిలోమీటర్ల మేర పనులను కంపెనీ పూర్తి చేసింది. మరో 5 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సంస్థకు రూ.75 కోట్ల మేర బిల్లులను కూడా చెల్లించేశారు. ఈ రోడ్డు పనుల్లో సదరు కంపెనీ వాడుతున్న సుద్దపొడి కూడా ఉచితంగా దొరికేదే అనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి మొరుసును వాడితే తారు రోడ్డు పక్కనే ఉండే రోడ్డు కూడా గట్టిపడుతుంది. దీంతో ఏదైనా వాహనం దీనిపై వెళితే రోడ్డు కుంగిపోయే అవకాశం ఉండదు. అందుకే మొరుసును వాడాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మాత్రం ఉచితంగా దొరికే సుద్దపొడితో పాటు నల్లమట్టిని కలిపి వాడుతున్నారు. నిర్మాణ వ్యయం తగ్గించుకుని భారీగా లాభాలు ఆర్జించేందుకు సదరు సంస్థ చేస్తున్న వ్యవహారంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి రానుంది.  

రోడ్డు పనులకు వినియోగిస్తున్న నల్లమట్టి, సుద్ద  

పనులన్నీ నాసిరకమే.. 
వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏ పని మంజూరైనా.. ఏ సంస్థకు కాంట్రాక్టు దక్కినప్పటికీ పనులు మాత్రం సదరు సూరీ కంపెనీయే చేపట్టాలి. ఈ మేరకు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కూడా పనులను సబ్‌కాంట్రాక్టు కింద వీరికి అప్పగించాల్సిందే. లేనిపక్షంలో సదరు కాంట్రాక్టు సంస్థ పనులు చేసే పరిస్థితి లేకుండా ఉన్న దుస్థితి. కొద్దిరోజుల క్రితం ఇదే ధర్మవరం మండలంలోని దర్శనమల ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడ కేవలం గాలికే కుప్పకూలిపోయింది. కనీసం సిమెంటు బెడ్‌ లేకుండా నాసిరకం ఇటుకలు పేర్చుకుంటూ పోవడంతో సదరు సూరి అనుచరులు నిర్మించిన గోడ గాలికే కుప్పకూలింది. ఇదే తరహాలో నియోజకవర్గంలో సూరి, ఆయన అనుచరులు చేపట్టిన పనులన్నీ నాసిరకంగా ఉంటూ 50 శాతం మేర నిధులను దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పనులన్నింటిపైనా విచారణ చేయాలంటూ రాష్ట్ర విజిలెన్స్‌తో పాటు కేంద్ర విజిలెన్స్‌కు కూడా అనేక ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై విచారణ చేస్తే అనేక అవకతవకలతో పాటు భారీ అవినీతి వ్యవహారం బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోది. ఈ నేపథ్యంలోనే విచారణ జరగకుండా తనను తాను కాపాడుకునేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుల వ్యవధిలోనే పార్టీ మారినట్లు చర్చ జరుగుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top